Jagan Vehicle Inspection: సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:10 PM
Jagan Vehicle Inspection: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారును రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి.

గుంటూరు, జూన్ 27: పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు మాజీ సీఎం కారు కింద నలిగి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ రెడ్డి వాహనాన్ని రవాణా శాఖ అధికారులు ఈరోజు (శుక్రవారం) తనిఖీ చేశారు. సింగయ్య మృతిపై ఇప్పటికే నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు.
ఈ క్రమంలో నేడు ఏపీ 40 డీహెచ్ 2349 వాహనం ఫిట్ నెస్‌ను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి. కాగా.. ఇటీవల రెంటపాళ్ల పర్యటనకు జగన్ వచ్చిన సందర్భంగా గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో వైసీపీ అధినేత కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై గుంటూరు నల్లపాటు పీఎస్‌లో కేసు నమోదు అవగా.. ఏ1గా డ్రైవర్ రమణారెడ్డి, ఏ2గా జగన్ మోహన్ రెడ్డి, వైసీపీకి చెందిన సుబ్బారెడ్డి, నాగేశ్వరరెడ్డి, విడుదల రజినీ, పేర్నినాని పేర్లు చేర్చారు.
కేసు నమోదు అనంతరం నల్లపాడు పోలీసులు సింగయ్య మృతికి కారణమైన జగన్ ప్రయాణించిన కారును తాడేపల్లికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఆ కారును గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉంచారు. ఈరోజు గుంటూరుకు చెందిన రవాణా శాఖ అధికారులు.. జగన్ కారు ఫిట్ నెస్‌ను చెక్ చేశారు. ఆర్టీవోకు చెందిన మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఓ టీం గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చి జగన్ వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనం ఫిట్‌గా ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
అయితే జగన్ వాహనం విషయంలో గుంటూరు ఎస్పీ రెండు రకాల ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. తొలుత జగన్ పర్యటన రోజు 0001 సఫారీ వాహనం ఢీకొని సింగయ్య మృతిచెందారని ప్రకటించారు. నాలుగు రోజుల తర్వాత జగన్ కారు కిందే పడి సింగయ్య మృతి చెందిన వీడియో బయటకు రావడంతో గుంటూరు ఎస్పీ మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి చెందినట్లు చెప్పారు. అలాగే ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ రమణారెడ్డి, జగన్‌తో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. దీనిపై గుంటూరు జిల్లా పోలీసులపై కూడా అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. తదుపరి విచారణలో ఎలాంటి తప్పిదాలు జరుగకుండా చూడాలని గుంటూరు పోలీసులు భావిస్తున్నారు.
జగన్‌కు స్వల్ప ఊరట
మరోవైపు ఏపీ హైకోర్టులో మాజీ సీఎం జగన్‌కు స్వల్ప ఊరట లభించింది. సింగయ్య మృతి ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్ట్‌లో జగన్ క్వాష్ పిటీషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా.. జగన్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే కేసు విచారణను జూలై 1కి (మంగళవారం)కు వాయిదా వేసింది కోర్టు. అప్పటి వరకు ఎటువంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
మొహర్రం పవిత్రతను గుర్తుచేసిన సీఎం చంద్రబాబు, లోకేష్
మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక
Read Latest AP News And Telugu News