Anagani Satya Prasad: స్టాంపుల కుంభకోణంపై మంత్రి ఫైర్
ABN , Publish Date - Jun 27 , 2025 | 08:06 AM
నకిలీ ఈ - స్టాంపుల కుంభకోణంపై రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అమరావతి, జూన్ 27: నకిలీ ఈ - స్టాంపుల కుంభకోణం వ్యవహారంపై రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ, డీఐజీలను ఆదేశించారు. ఈ వ్యవహారంపై శుక్రవారం అమరావతిలో ఉన్నతాధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈ తరహా వ్యవహారం రాష్ట్రంలో పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ -స్టాంపుల జారీ ప్రక్రియ ఎలా జరుగుతుందో పరిశీలించాలని ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరో వైపు నకిలీ ఈ - స్టాంపుల కుంభకోణం కేసును కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్‌కు ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటి వరకూ వేలకు పైగా ఈ - స్టాంపులు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలక నిందితులు బోయ ఎర్రప్ప అలియాస్ బాబు, అతని భార్య భార్గవితోపాటు మోహన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. వీరిని సైతం కళ్యాణ దుర్గం తరలించారు. అలాగే గతంలో మీ - సేవలో పని చేసిన వ్యక్తుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను అనంతపురం డీఎస్పీ విచారిస్తున్నారు.
ఎస్ఆర్‌సీ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీ - సేవ నిర్వాహకుడు ఎర్రప్ప అలియాస్ బాబుతోపాటు అతని భార్య భార్గవి, మోహన్‌పై అనంతపురం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఇటీవల అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నకిలీ ఈ -స్టాంపుల వ్యవహారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు 3 జిల్లాలకు సీఎం చంద్రబాబు
వైభవంగా ప్రారంభమైన బోనాలు.. కిక్కిరిసిన కోట
For More AndhraPradesh News And Telugu News