Share News

AP Tourism: సీఎం సూచనలతోనే ముందుకు: మంత్రి దుర్గేష్

ABN , Publish Date - Jun 27 , 2025 | 03:17 PM

AP Tourism: పర్యాటక రంగంలో ఆకాశమే హద్దు - అవకాశాలు వదలొద్దు అన్న సీఎం సూచనలతో ముందుకు వెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఈ రంగం ద్వారా యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు.

AP Tourism: సీఎం సూచనలతోనే ముందుకు: మంత్రి దుర్గేష్
AP Tourism

అమరావతి, జూన్ 27: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిని 20 శాతానికి తీసుకెళ్లి.. సీఎం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను నెరవేరుస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో జీఎఫ్ఎస్‌టీ టూరిజం కాంక్లేవ్‌లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం పూర్తి నిరాదరణకు గురైందని విమర్శించారు. గత ప్రభుత్వ విషాద ఛాయలు మళ్లీ పునరావృతం కాకుండా చేస్తామని తెలిపారు. ఈ రంగంలో ఆకాశమే హద్దు - అవకాశాలు వదలొద్దు అన్న సీఎం సూచనలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ రంగం ద్వారా యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రైవేటు రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగమన్నారు. 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం పర్యాటకాభివృద్ధికి అద్భుత అవకాశమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


పర్యాటక రంగంలో ఏపీ కీలక పాత్ర: సుమన్

2029కి 25 మిలియన్ ఉద్యోగాలు సృష్టించాలని... 2.42 లక్షల కోట్లు పర్యాటకం ద్వారా దేశానికి వస్తోందని కేంద్ర పర్యాటకశాఖ కార్యదర్శి సుమన్ బిల్లా తెలిపారు. పర్యాటక రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 75 కొత్త విమానాశ్రయాలు దేశంలో నిర్మితం అయ్యాయని.. ఇండిగో, టాటాల సంస్థలే 1000కి పైగా విమానాలు నడుపుతున్నాయని చెప్పారు. మనం ఇంకా 5 శాతంగానే పర్యాటకం ఉండడానికి కారణాలు ఏమిటన్నది విశ్లేషించుకోవాలని అన్నారు. దేశంలో 250 కోట్ల మంది ప్రయాణాలు చేస్తున్నారని.. అందులో 47 కోట్ల మంది హోటళ్లు, షాపింగ్ కోసం పర్యాటకానికి వస్తున్నారని చెప్పారు. ఈ సంఖ్య పెద్దేదే అయినా ఇంకా పెంచుకోవాల్సి ఉందన్నారు.


2.7 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటే 1.9 కోట్ల మంది విదేశాల నుంచి వస్తున్నారన్నారు. ఇంత మంది భారతీయులను దేశంలోని పర్యాటక ప్రాంతాలకు మళ్లిస్తే సంపద పెరిగినట్టే అని పేర్కొన్నారు. ఇంత మంది పర్యాటకులను ఆకట్టుకోవాలంటే బ్రాండెడ్, అన్ బ్రాండెడ్ హోటల్ గదులు పెరగాల్సి ఉందన్నారు. 2029 నాటికల్లా ఈ సామర్ధ్యం మూడు రెట్లకు పెరగాల్సి ఉందని.. మరిన్ని పెట్టుబడులు పర్యాటక రంగంలో హోటల్ బిజినెస్‌లో పెరగాలన్నారు. 15 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని జాతీయ స్థాయిలో ప్రణాళిక చేశామని.. తద్వారా మౌలిక సదుపాయాలు పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.


పర్యాటక ప్రాజెక్టు పెట్టాలంటే మన దేశంలో 56 లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటోందని.. ప్రతీ లైసెన్సుకు 60 రోజుల సమయం పడుతోందన్నారు. సింగపూర్‌లో కేవలం 25 లైసెన్సులు రెండు వారాలు మాత్రమే పడుతోందని... లైసెన్సుల జారీ వేగం పెరగాలని అభిప్రాయపడ్డారు. ఏపీ పర్యాటక పాలసీ పెట్టుబడులను ఆకర్షించేలా ఉందని... రాష్ట్రానికి చాలా ప్రకృతి వనరులు ఉన్నాయన్నారు. తిరుపతి లాంటి చోట్ల 10 వేలకు పైగా బ్రాండెడ్ హోటల్ రూములు అవసరం ఉంటే ప్రస్తుతం ఇవి వెయ్యిలోపే ఉన్నాయని అన్నారు. కనీసం 3 - 4 రోజుల పాటు పర్యాటక ప్రాంతాల్లో ఉండేలా ఏర్పాట్లు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి లాంటి ప్రాంతాలు ఏపీలో చాలా ఉన్నాయని.. బౌద్ధ క్షేత్రాలు, ఎకో టూరిజం, బీచ్‌లు ఉన్నాయని, కోనసీమ, అరకు, పాపికొండలు లాంటి ప్రాంతాలను చాలా అభివృద్ధి చేయాల్సి ఉందని సుమన్ బిల్లా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్

మొహర్రం పవిత్రతను గుర్తుచేసిన సీఎం చంద్రబాబు, లోకేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 27 , 2025 | 04:01 PM