AP News: ఆనందంగా స్కూలుకు బయలుదేరారు.. ఇంతలోనే ఊహించని ఘటన
ABN , Publish Date - Jul 08 , 2025 | 10:16 AM
కృష్ణా జిల్లాలోని పామర్రు మండలంలో విషాద ఘటన జరిగింది. స్కూల్‌కు వెళ్తుండగా లారీ ఢీకొని పదోతరగతి విద్యార్ధి కలపాల జోయల్ మృతిచెందాడు. మృతుడి సోదరుడు అభి, తండ్రికి గాయాలవడంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కృష్ణా: రోజులాగానే ఆనందంగా విద్యార్థులు స్కూల్‌కు బయలుదేరారు. కానీ అంతలోనే ఊహించని ఘటనతో విద్యార్థులు షాక్‌కి గురయ్యారు. వారు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ లారీ మృత్యువు రూపంలో కబలించింది. ఈ ప్రమాదం కృష్ణా జిల్లాలోని (Krishna District) పామర్రు మండలంలో జరిగింది. స్కూల్‌కు వెళ్తుండగా లారీ ఢీకొని పదోతరగతి విద్యార్ధి కలపాల జోయల్ (15) మృతిచెందాడు. మృతుడి సోదరుడు అభి, తండ్రికి గాయాలవడంతో.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జోయల్ తండ్రి జేమ్స్ తన ఇద్దరు పిల్లలను పామర్రులోని పాఠశాలకు పంపించడానికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని కురుమద్దాలి వద్ద లారీని డ్రైవర్ రివర్స్ చేస్తుండగా వెనుక వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. లారీ ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే జోయల్ మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో బల్లిపర్రు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం
Read latest AP News And Telugu News