MP Sivanath: ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పీఎం-శ్రీ పాఠశాలలు మంజూరు చేయాలి
ABN , Publish Date - Jul 22 , 2025 | 07:47 PM
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద ఎన్టీఆర్ జిల్లాకి పీఎం-శ్రీ పాఠశాలల కేటాయింపు చాలా తక్కువగా ఉన్న అంశాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్‌సభలో మంగళవారం ప్రస్తావించారు.

ఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SRI) పథకం కింద ఎన్టీఆర్ జిల్లాకి పీఎం-శ్రీ పాఠశాలల కేటాయింపు చాలా తక్కువగా ఉన్న అంశాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Sivanath) లోక్‌సభలో మంగళవారం ప్రస్తావించారు. రూల్ నెంబర్ 377 కింద (Laid on the table) ఎన్టీఆర్ జిల్లాకు పీఎం-శ్రీ పాఠశాలల కేటాయింపుపై పున: సమీక్షించి, మరిన్ని పాఠశాలల మంజూరు చేయాలనే అంశాన్ని లేవనెత్తారు ఎంపీ కేశినేని శివనాథ్.
పీఎం-శ్రీ పాఠశాలల ఎంపికలో ఎన్టీఆర్ జిల్లాకు తక్కువ ప్రాతినిథ్యం దక్కిందని ఎంపీ కేశినేని శివనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దశల్లో జిల్లాలో మొత్తం 827 పాఠశాలలను బెంచ్‌మార్క్ చేసినప్పటికీ, వాటిలో 550 పాఠశాలలు అర్హత ప్రమాణాలను చేరుకున్నప్పటికీ, కేవలం 27 పాఠశాలలకే ఆమోదం లభించిందని తెలిపారు. ఈ ఎంపిక శాతం కేవలం 4.9 శాతంగా ఉండటం ఏపీలోనే అత్యల్పమని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం మొత్తం 62 పాఠశాలలను కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసినప్పటికీ, వాటిలో 56శాతం పైగా పాఠశాలలు తుది ఎంపికలోకి రాకపోవడం బాధకరమని అన్నారు. జిల్లాలో జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలకు అనుగుణంగా పాఠశాలలు నడుస్తున్నాయనీ, విద్యా మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని గుర్తుచేస్తూ, ఎంపిక ప్రక్రియను పున:సమీక్షించాలని, మరిన్ని పాఠశాలలను ఎన్టీఆర్ జిల్లాకు మంజూరు చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
For More AP News and Telugu News