Minister Lokesh: కార్యకర్తలతో మాట్లాడుతాం.. ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం: మంత్రి లోకేష్
ABN , Publish Date - Jun 25 , 2025 | 02:34 PM
Minister Lokesh: గత ఎన్నికలకు ముందు బాబు సూపర్ సిక్స్, బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, ఎన్నికల తర్వాత మన టీడీపీ, సభ్యత్వం కార్యక్రమాల్లో కార్యకర్తలంతా చురుగ్గా పాల్గొన్నారని మంత్రి లోకేష్ అన్నారు. పార్టీ కార్యకలాపాలను డిజిటల్ విధానంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి పని చేసిన వారిని గుర్తించాలన్నదే పార్టీ విధానమని చెప్పుకొచ్చారు.

అమరావతి, జూన్ 25: ఇకపై ప్రతిరోజూ ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ విజయాలను జులై 2 నుంచి ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. కూటమిలో మనది పెద్దన్న పాత్ర అని.. సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు. ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తాను ప్రతీ రోజు ఐదుగురు ప్రజలు, ఐదుగురు కార్యకర్తలతో మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని అన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని.. పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదని స్పష్టం చేశారు.
అదే పార్టీ విధానం..
గత ఎన్నికలకు ముందు బాబు సూపర్ సిక్స్, బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, ఎన్నికల తర్వాత మన టీడీపీ, సభ్యత్వం కార్యక్రమాల్లో కార్యకర్తలంతా చురుగ్గా పాల్గొన్నారన్నారు. పార్టీ కార్యకలాపాలను డిజిటల్ విధానంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి పని చేసిన వారిని గుర్తించాలన్నదే పార్టీ విధానమని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక కేడర్‌ను మరువకుండా చంద్రబాబు, తాను ప్రతీ జిల్లాకు వెళ్లినపుడల్లా కార్యకర్తలను కలుస్తున్నామన్నారు. పార్టీ అధినేత నుంచి కార్యకర్త వరకు పార్టీ ఆదేశాలను అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.
ప్రజల్లోకి తీసుకెళ్లండి..
తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబమని.. పార్టీ సంస్థాగత విషయాలు, సమస్యలపై చంద్రబాబుతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు తెలిపారు. 10 నిర్ణయాల్లో ఒక తప్పు జరగొచ్చని.. తప్పులున్నప్పుడు వివిధ స్థాయిల్లో నాయకుల ద్వారా తమ దృష్టికి తెస్తే సరిదిద్దుకుంటామని చెప్పారు. జులై 2 నుంచి ప్రతిఒక్కరూ గడపగడపకు వెళ్లి గత ఏడాది కాలంలో మనం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నామని లోకేష్ ప్రకటించారు.
అలాంటి వాటిని ప్రజలు హర్షించరు..
అహంకారం, ఇగోలను ప్రజలు హర్షించరన్నారు. గత పాలకులు అహంకారంతో వ్యవహరించడం వల్లే 151 కాస్తా 11కు పడిపోయిందన్నారు. ఎవరైనా నాయకులు తప్పుగా ప్రవర్తిస్తే ఆ ప్రభావం పార్టీపై పడుతుందని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఓర్పు, సహనంతో వారు చెప్పే సమస్యలను వింటూ పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వం కక్షసాధింపుతో నిలిపివేసిన ఉపాధి హామీ, నీరు – చెట్టు బిల్లులను 90 శాతం వరకు క్లియర్ చేశామని.. మిగిలినవి కూడా జులైలోగా అందజేసే ఏర్పాటు చేస్తామన్నారు. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలుంటే మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని మంత్రి లోకేష్ తెలిపారు.
రెడ్‌బుక్‌పై అనుమానాలు వద్దు
‘యువగళం పాదయాత్ర, శంఖారావం కార్యక్రమంలో మీ ప్రాంతానికి రాలేకపోయాను. ఆ తర్వాత నా అవసరం లేకుండా మీరు భారీ మెజారిటీతో పార్టీని గెలిపించారు. పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ బలం, బలహీనతలను నేను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నా. చట్టపరిధిలో రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రతీ కార్యకర్తను గౌరవిస్తాం: మంత్రి కొల్లు
సిట్ కస్టడీ.. జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పీఎస్‌కు కాకాణి
ఫ్రెండ్స్‌ను కలుస్తానంటూ వెళ్లిన యువతి.. ఓయో లాడ్జ్‌లో
Read latest AP News And Telugu News