AP Water Projects: కేఎల్ రావు తెలుగువారు కావడం గర్వకారణం: మంత్రి నిమ్మల రామానాయుడు
ABN , Publish Date - Jul 15 , 2025 | 02:15 PM
AP Water Projects: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ప్రశ్నార్థకమైన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందని అన్నారు.

విజయవాడ, జులై 15: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని.. అయితే 50 ఏళ్ల క్రితమే నదుల అనుసందానికి నాంది పలికింది కేఎల్ రావు అని రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు గుర్తు చేసుకున్నారు. ప్రఖ్యాత ఇంజినీర్ డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా కేఎల్ రావు చిత్రపటానికి మంత్రి నిమ్మల నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరవుతో వచ్చే దుర్భిక్ష పరిస్థితులు పారత్రోలాలంటే నదుల అనుసందానమే మార్గమని స్పష్టం చేశారు. కేఎల్ రావు స్పూర్తిని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని తెలిపారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, హిరాకుడ్ సహా దేశంలో అత్యంత భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి కేఎల్ రావు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ప్రఖ్యాత ఇంజినీర్ కేఎల్ రావు తెలుగువారు కావడం గర్వకారణమని కొనియాడారు.
ఏటా 3 వేల టీఎంసీల వరద నీరు సముద్రంలోకి పోకుండా పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నిర్మిస్తున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందని మండిపడ్డారు. ప్రశ్నార్థకమైన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందని అన్నారు. 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్ తిచేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టిసీమ కాదు.. వట్టిసీమ అని గతంలో శాసనసభలో జగన్ అవహేళన చేశారని.. చంద్రబాబు కృషి పట్టుదలతో పట్టిసీమ పూర్తి చేయడంతో కృష్ణాడెల్టా సస్యశ్యామలం అవుతోందని వెల్లడించారు. ఈ ఏడాది కృష్ణా డెల్టాలో వర్షాలు ఆశించినంతగా కురవలేదన్నారు. ఎగువ ప్రాజెక్టులు నిండకపోయినా పట్టిసీమ నీరుతో కృష్ణా డెల్టా కళకళలాడుతోందని చెప్పుకొచ్చారు.
విజయవాడలో నీలం రంగులో ప్రవహించే కృష్ణమ్మ .. గోదారమ్మ కలవడంతో ఎరుపురంగు పులుముకుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల గేట్లకు కనీసం గ్రీజు కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస నిర్వహణ లేకపోవడంతోనే గతంలో పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను నిర్వహణ, మరమ్మతులకు నిధులిచ్చామన్నారు. ప్రజలిచ్చిన అధికారంతో ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. ఈ ఏడాదిలో ఉత్తరాంధ్రకు పోలవరం ద్వారా నీరు తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. హంద్రీనీవా ప్రవాహం 2100 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కుల ప్రవాహం పెంచేలా ఏడాదిలోనే కాలువలు వెడల్పు చేశామన్నారు. స్పూర్తి నిచ్చేలా పనిచేయడమే కెఎల్ రావుకు ఇచ్చే ఘనమైన నివాళి అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం
Read latest AP News And Telugu News