AP News: సీటుకు రేటు..!
ABN , Publish Date - Jul 15 , 2025 | 10:13 AM
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిత్య పంపకాలే అన్నది బహిరంగ రహస్యమే. అక్కడ కీలకమైన సబ్ రిజిస్ట్రార్ పోస్టుపైనే అందరి దృష్టి ఉంటుంది. అందులోనూ కీలకమైన కార్యాలయాల్లో ఆ పోస్టుకుండే డిమాండ్ అంతాఇంతా కాదు. అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ పోస్టు కూడా ఆ కోవలోకే వస్తుంది.

అనంతపురం రూరల్ సబ్‌రిజిస్ట్రార్ పోస్టుకు డిమాండ్
ముడుపులు ఇస్తేనే భర్తీ
పోటీలో ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లు
మరో రెండు పోస్టులున్నా నియమించడంలో
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం
అనంతపురం కలెక్టరేట్, జూలై14(ఆంధ్రజ్యోతి): సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) కార్యాలయాల్లో నిత్య పంపకాలే అన్నది బహిరంగ రహస్యమే. అక్కడ కీలకమైన సబ్ రిజిస్ట్రార్ పోస్టుపైనే అందరి దృష్టి ఉంటుంది. అందులోనూ కీలకమైన కార్యాలయాల్లో ఆ పోస్టుకుండే డిమాండ్ అంతాఇంతా కాదు. అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ పోస్టు కూడా ఆ కోవలోకే వస్తుంది. జిల్లాలో రామ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరువాత అత్యధిక డాక్యుమెంట్లు జరిగే కార్యాలయం ఇదే. ఇందులో సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు ఎప్పటిలాగే ఈసారి కూడా డిమాండ్ ఏర్పడింది. ముగ్గురు అధికారులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఓ కీలక అధికారికి ముడుపులు అందజేస్తేనే ఆ సీటు భర్తీ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో మరో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆ సీట్లు ఖాళీగా ఉన్నా రూరల్ సీటుకే డిమాండ్ ఉండటం గమనార్హం.
ముడుపులు ఇస్తేనే...
అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ సీటులో కూర్చోవాలంటే ముడుపులివ్వాల్సిందేనన్న గుసగుసలు ఆ శాఖలో వినిపిస్తున్నాయి. రూరల్ మండలంలోని భూములు అనంతపురం నగరానికి సమీపంలో ఉండటంతో వాటి ధరలు అధికంగా ఉంటున్నాయి. రిజిస్ర్టేషన్లు జరిగితే లావాదీవీలు ఎక్కువగానే ఉంటాయి. దీనికి తోడు కొన్ని చుక్కల, వివాద భూముల డాక్యుమెంట్ల విషయంలో పెద్ద మొత్తంలో వసూలు చేస్తారనే ఆరోపణలున్నాయి. గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఓ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి దొరికారు. ముడుపులిచ్చేవారే ఈ సీటులోకి వస్తుంటారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆమ్యామ్యాలిచ్చుకోవాల్సిందేనన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం ఆ బేరసారాలు ఇంకా ముగిసినట్లు లేవు. అందుకే ఆ సీటు భర్తీ కాలేదని తెలుస్తోంది. పది రోజులైనా అక్కడ ఎవరినీ నియమించకపోవడమే ఇందుకు నిదర్శనం. రాయలసీమ స్థాయిలో ఓ ఉన్నతాధికారికి ఆ ముడుపులు అందుతాయని సమాచారం.
పోటీలో ముగ్గురు...
అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు ఎప్పటిలాగే ఈసారి డిమాండ్ ఏర్పడింది. ఏకంగా ఆ సీటులోకి రావడానికి ముగ్గురు సబ్ రిజిస్ట్రార్‌లు పోటీ పడుతున్నారు. హిందూపురంలో పనిచేస్తున్న రాజశేఖర్, సెలవులో ఉన్న శిరీషా భరత్, కడప జిల్లా రాయచోటిలో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ సత్తార్ ఆ సీటులోకి రావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆ పోస్టుకు అధికారిని కేటాయించడానికి మరో వారం రోజులైనా ప డుతుందని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడ ఇన్‌చార్జిగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ టీజీ రెడ్డి కొనసాగవచ్చనే ప్రచారమూ లేకపోలేదు.
ఆ రెండు పోస్టులకు...
జిల్లాలో మరో రెండు సబ్ రిజిస్ట్రార్ పోస్టుల్లో ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. కళ్యాణదుర్గం, తాడిపత్రిలో సీనియర్ అసిస్టెంట్‌లే ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్లుగా ఉన్నారు. ఆ రెండు స్థానాలకు ఎవరినీ నియమించలేదు. కళ్యాణదుర్గంలో ప్రస్తుత అధికార పార్టీ నేతల పరిచయంతో ఆ సీటుకు మరొకరిని రానిచ్చే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. తాడిపత్రిలో ఆయన స్థానికంగా ఉండటంతో రాజకీయంగానూ ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓ సబ్ రిజిస్ట్రార్ అక్కడికి రావడానికి ప్రయత్నించినా వీలుకాలేదని తెలిసింది. మరి కొంతకాలం ఆ పోస్టుల్లో సబ్ రిజిస్ట్రార్లను ఉన్నతాధికారులు నియమించే ధైర్యం చేయలేరనే ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ర్యాంకర్లను సన్మానించిన మంత్రి లోకేశ్
ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు గవర్నర్లు
Read Latest AP News And Telugu News