Nakka Anandbabu Fire On Jagan: రాజనాలను తలదన్నేలా జగన్ నటన.. నక్కా ఆనంద బాబు సెటైర్
ABN , Publish Date - Jul 16 , 2025 | 04:02 PM
Nakka Anandbabu Fire On Jagan: జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తుంటే.. పాత సినిమాల్లో విలన్ రాజనాల క్యారెక్టర్ గుర్తుకు వస్తోందన్నారు నక్కా ఆనంద బాబు. చేయాల్సిన ఘోరాలన్నీ చేసేసి.. తాపీగా ఉండేలా నటించిన రాజనాలను తలదన్నేలా జగన్ నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

అమరావతి, జులై 16: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) విరుచుకుపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు (Nakka Anand Babu). ఈరోజు (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. సినిమాల్లో చేసిన వాటిని అనుకరిస్తే తప్పేంటి అంటూ జగన్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల్లో చేసే హత్య, మానభంగాలు సమాజంలో చేసినా తప్పు లేదంటారా అంటూ టీడీపీ నేత కౌంటర్ ఇచ్చారు. వివేకం కూడా సినిమానే కదా.. కోర్టుకు వెళ్లి ఎందుకు ఆపావంటూ జగన్‌కు ఆనందబాబు సూటి ప్రశ్న వేశారు. రఘురామకృష్ణం రాజును పోలీసులతో హింసించిన విషయం మరిచారా అంటూ మండిపడ్డారు.
వైసీపీ డ్రామా కంపెనీ..
అప్పులు చేసింది చాలక.. ఇంకా విమర్శలు చేస్తున్నావా అంటూ చివాట్లు పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తుంటే.. పాత సినిమాల్లో విలన్ రాజనాల క్యారెక్టర్ గుర్తుకు వస్తోందన్నారు. చేయాల్సిన ఘోరాలన్నీ చేసేసి.. తాపీగా ఉండేలా నటించిన రాజనాలను తలదన్నేలా జగన్ నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయాన్ని మూసేసి.. స్టూడియో పెట్టుకుంటే మంచిదంటూ కామెంట్స్ చేశారు. 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఛీకొట్టినా.. ఇంకా సిగ్గు లేకుండా కామెంట్లు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అవసాన దశలో ఉన్న పార్టీని బతికించుకోవాలనే ఆలోచనతోనే వైసీపీ అనే డ్రామా కంపెనీని జగన్ నడుపుతున్నారన్నారు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ నిరంతరం మాట్లాడుతున్నారని.. ఓ డీఐజీని మాఫియా డాన్ అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చీటికి మాటికి ప్రెస్‌మీట్లు పెట్టిన పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పోలీసులను జగన్ దూషిస్తుంటే.. పోలీస్ అధికారుల సంఘం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడో 25వ ర్యాంక్‌లో ఉన్న అధికారిని డీజీపీని చేసి.. జగన్ తన పబ్బం గడుపుకున్నారని విరుచుకుపడ్డారు. పోలీసులను జగన్ తన రాజకీయ కక్షలకు వాడుకున్నారని ఆరోపించారు. జగన్‌ను నమ్ముకుంటే పోలీసులకు కారాగార వాసం దక్కిందని... పీఎస్సార్ ఆంజనేయులు వంటి వారు జైలుకు వెళ్లారని గుర్తుచేశారు.
వారంతా సైకో బ్యాచే..
లోకేష్ సభలను.. పాదయాత్రను అడ్డుకోలేదా అని ప్రశ్నించారు. మాట్లాడే మైక్ లాక్కున్నారని.. నించున్న స్టూల్ గుంజేశారని అప్పటి సంఘటనలు గుర్తు చేశారు టీడీపీ నేత. చంద్రబాబు ఇంటి గేటును తాళ్లతో కట్టి బయటకు రాకుండా చేసిన జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. నా బీసీలు.. నా ఎస్సీలని జగన్ అన్నారని.. వారెవరూ జగన్‌కు ఓటేయలేదన్నారు. బీసీలను బానిసలుగా.. ఎస్సీలను అంటరానివారిగా చూశారని వ్యాఖ్యలు చేశారు. బడుగులపై జగన్ హయాంలో దమనకాండ జరిగిందని తెలిపారు. సొంత సామాజిక వర్గం అయితే గుమ్మం లోపలికి.. వేరే వాళ్లు అయితే తన ముందు చెప్పులు కూడా వేసుకోకూడదన్నట్టు జగన్ వ్యవహరించారని దుయ్యబట్టారు. దొంగ కేసులు ఎలా పెట్టించాలో.. జగన్‌కు తెలిసినంతగా ఎవరికైనా తెలుసా అని నిలదీవారు. గత ప్రభుత్వంలో జగన్ తన సొంత పార్టీ ఎంపీని అరెస్ట్ చేయించి.. చితకబాదించారని.. ఎంపీని నాలుగున్నరేళ్లు నియోజకవర్గానికి రానివ్వకుండా జగన్ అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జగన్ సభలకు వచ్చేది జనం కాదని.. సైకో బ్యాచ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు కూడా సిద్దం సిద్దం అని సభలకు జనాన్ని తెచ్చారని.. ఆ సభలకు వచ్చిన వారు జగన్‌ను ఇంటికి పంపడానికి సిద్దమని చెప్పారని.. అదే రుజువు అయిందని టీడీపీ నేత చెప్పారు.
అదే జగన్ అజెండా..
కర్ణాటకలో మామిడికి ఎక్కువ ధరలు వస్తున్నాయంటూ చెప్పడం మరో బూటకపు మాట అంటూ కొట్టిపారేశారు. కర్ణాటకలో మామిడికి ఎక్కువ ధర ఉంటే.. తమ దగ్గరున్న మామిడి పంటను కొనుగోలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎందుకు లేఖ రాస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంటే.. జగన్ ఇన్ని పర్యటనలు చేయగలరా అని నిలదీశారు. ‘జగన్ హయాంలో మమ్మల్ని రోడ్డెక్కనిచ్చారా..? పవన్ కళ్యాణ్‌ను రాష్ట్రంలోకి రాకుండానే అడ్డుకున్నారు. చంద్రబాబు మొదలుకుని అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, చింతమనేని, ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారిని చాలా మందిని అరెస్ట్ చేయించారు’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు పబ్జీ ఆడుకున్నారని.. ఇప్పుడు కూడా ఆ పని చేస్తే.. జగన్‌కున్న ఫ్రస్ట్రేషన్ తగ్గుతుందంటూ సెటైర్ విసిరారు. బెట్టింగ్ మాఫియాను, బ్లేడ్ బ్యాచ్‌ను పరామర్శించేందుకు వెళ్తున్నారని.. జగన్ దొంగ పరామర్శ యాత్రలను ప్రజలు చూస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడమే జగన్ అజెండా అంటూ వ్యాఖ్యలు చేశారు. అమర్ రాజా బ్యాటరీ, లులు గ్రూపు, కాగ్నిజెంట్ కంపెనీలే కాదు.. చివరకు డ్రాయర్ల కంపెనీని కూడా జగన్ తరిమేశారంటూ ఫైర్ అయ్యారు. జగన్ పనికి మాలిన వాడని... ప్రజా జీవితానికి పనికి రాడని ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చారని నక్కా ఆనంద బాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అసలు, సిసలు సైకో పార్టీ వైసీపీ.. కోటంరెడ్డి ఫైర్
వైసీపీ నేతల నిందల్ని మోస్తూ సేవాతత్వంతో ముందుకు: మంత్రి ఆనం
Read Latest AP News And Telugu News