Chittoor Property Dispute: ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:46 PM
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తమ్మిగానిపల్లి పంచాయతీ కర్లఘట్టలో ఓ హైడ్రామా చోటు చేసుకుంది. మునెప్ప అనే వ్యక్తికి మునెమ్మ, గంగమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.

చిత్తూరు: ఆస్తి తగాదా పరిష్కారం కోసం సురేశ్ అనే వ్యక్తి హైడ్రామా క్రియేట్ చేశాడు. ఏకంగా కన్న తల్లినే కరెంటు స్తంభం వద్ద నిలబెట్టి, డ్రిప్పు పైపు చుట్టి తన అన్న.. తల్లిని ఆ స్తంభానికి కట్టేసినట్టు సురేశ్ క్రియేట్ చేశాడు. అంతేకాకుండా దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశ చేయడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. పథకం ప్రకారం కొంతమంది ఉచిత సలహా మేరకు ఇలాంటి డ్రామాకు పాల్పడ్డ సురేశ్ అసలు స్వరూపాన్ని పోలీసులు వెలికి తీశారు.
ఇదీ విషయం..
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తమ్మిగానిపల్లి పంచాయతీ కర్లఘట్టలో ఈ డ్రామా ఘటన చోటు చేసుకుంది. మునెప్ప అనే వ్యక్తికి మునెమ్మ, గంగమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలకు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య మునెమ్మ చనిపోయి చాలా కాలమైంది. ఆరోగ్యం సరిగా లేక, ఈనెల 5వ తేదీన మునెప్ప చనిపోయాడు. నిన్ననే కర్మక్రియలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో గంగమ్మ కుమారుడు సురేశ్ ఈరోజు (సోమవారం) ఉదయం తల్లిని (గంగమ్మను) తన పొలంలో కరెంటు పోల్ వద్ద నిలబెట్టి డ్రిప్ పైప్ చుట్టి వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆస్తి తగాదాల నేపథ్యంలో తన పెద్దమ్మ కుమారుడు మంజునాథ్ ఇలా చేశాడని ఆరోపించాడు.
ఈ వీడియో వైరల్ కాస్త అయ్యింది. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేయగా.. సురేశ్ చేసిన హైడ్రామా బయటపడింది. వాస్తవానికి మంజునాథ్ సంఘటన సమయంలో అక్కడ లేరని పోలీసులు గుర్తించారు. మునెమ్మ కుమార్తెలు మాత్రం అక్కడే ఉండి గడ్డి కోస్తూ ఉన్నారు. వీడియో వారందరి సమక్షంలోనే తీశారు. వీడియో పూర్తిగా ఆస్తి సంబంధిత తగాదాల నేపథ్యంలో సృష్టించిన డ్రామా మాత్రమేనని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు కారకులైన సురేశ్‌తో పాటు అతడికి సలహా ఇచ్చిన వ్యక్తిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
ఆ మూడు ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమే: దేవినేని
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియామకం
Read Latest AP News And Telugu News