Goa Governor: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియామకం
ABN , Publish Date - Jul 14 , 2025 | 02:18 PM
Goa Governor: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. అలాగే హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్‌ను రాష్ట్రపతి నియమించారు.

అమరావతి, జులై 14: గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్‌గజపతిరాజు (Ashok Gajapathi Raju) నియమితులయ్యారు. మూడు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు (సోమవారం) ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్ (Ashin Kumar Ghosh), గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తాలను (Kavinder Gupta) రాష్ట్రపతి నియమించారు. విజయనగరానికి చెందిన అశోక్ గజపతి రాజు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. గతంలో ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయనను గోవా గవర్నర్‌గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇక హర్యానా గవర్నర్‌గా ప్రస్తుతం బండారు దత్తాత్రేయ కొనసాగుతూ వచ్చారు. తాజాగా ఆయన స్థానంలో కొత్త గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్‌ను నియమించారు. ఆషింకుమార్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
కాగా.. రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా భావించే గవర్నర్ పదవిని చేపట్టిన వారిలో తెలుగువారు చాలా మందే ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల రాజ్‌భవన్‌లో తెలుగు వారు గవర్నర్లుగా ఆశీనులయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా చేసిన ప్రముఖులు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకూ మొత్తం 20 మంది వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు. అలాగే ఒడిశా, తమళనాడులోని తెలుగు కుటుంబాల్లో జన్మించిన ఇద్దరితో పాటు తెలుగింటి కోడలుగా వచ్చిన ఒకరు కూడా గవర్నర్లుగా పనిచేశారు. అంతేకాకుండా వీరిలో పలువురు ఏకకాలంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఉన్నారు.
గవర్నర్లుగా తెలుగు వారు వీరే..
1. భోగరాజు పట్టాభి సీతారామయ్య - మధ్యప్రదేశ్ మొదటి గవర్నర్ (1956-57) -(పశ్చిమ గోదావరి జిల్లా వాసి)
2. బూర్గుల రామకృష్ణారావు - కేరళ గవర్నర్ 1956-60, 1960-62 (ఉత్తర్‌ప్రదేశ్) (మహబూబ్‌నగర్ జిల్లా వాసి)
3. వి.వి.గిరి - ఉత్తర్‌ప్రదేశ్ (1957-60), కేరళ (1960-65), కర్ణాటక (1965-67) (బెర్హంపూర్, ఒడిశా) గవర్నర్
4. బెజవాడ గోపాలరెడ్డి - ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ (1967-72) (నెల్లూరు జిల్లా వాసి)
5. మర్రి చెన్నారెడ్డి - ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ (1974-77), పంజాబ్ గవర్నర్ (1982-83), రాజస్థాన్ గవర్నర్ (1992-93), తమిళనాడు గవర్నర్ (1993-96) (రంగారెడ్డి జిల్లా వాసి)
6. కోన ప్రభాకర్‌రావు - పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ (1983-84), సిక్కిం గవర్నర్ (1984-85), మహారాష్ట్ర గవర్నర్ (1985-86) (గుంటూరు జిల్లా వాసి)
7. పెండేకంటి వెంకట సుబ్బయ్య - బిహార్ గవర్నర్ (1985-88), కర్ణాటక గవర్నర్ (1987-1990) (కర్నూలు జిల్లా వాసి)
8. జనరల్ కె.వి.కృష్ణారావు - మణిపూర్, నాగాలాండ్ (1984-1989), జమ్ముకశ్మీర్ 1989-90, 1993-99 (విజయనగరం జిల్లా వాసి)
9. కాసు బ్రహ్మానందరెడ్డి - మహారాష్ట్ర (1988-90) (గుంటూరు జిల్లా వాసి)
10. బి.సత్యనారాయణ రెడ్డి - ఉత్తర్‌ప్రదేశ్ (1990-93), ఒడిశా (1993-95) (మహబూబ్‌నగర్ జిల్లా వాసి)
11. కె.వి.రఘునాథరెడ్డి - త్రిపుర గవర్నర్ (1990-93), పశ్చిమ బెంగాల్ గవర్నర్ (1993-98) (నెల్లూరు జిల్లా వాసి)
12. పి.శివశంకర్ - సిక్కిం (1994-95), కేరళ గవర్నర్ (1995-96) (మెదక్ జిల్లా వాసి)
13. వి.ఎస్.రమాదేవి - హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ (1997-99), కర్ణాటక (1999-2002) (పశ్చిమ గోదావరి జిల్లా వాసి)
14. పి.ఎస్.రామ్మోహన్‌రావు - కర్ణాటక గవర్నర్ (1999-2002), తమిళనాడు (2002-2004) (పశ్చిమ గోదావరి జిల్లా వాసి)
15. వి.రామారావు - సిక్కిం గవర్నర్ (2002-2007) (కృష్ణా జిల్లా వాసి)
16. కొణిజేటి రోశయ్య - తమిళనాడు గవర్నర్ (2011-16) (గుంటూరు జిల్లా వాసి)
17. చెన్నమనేని విద్యాసాగర్‌రావు - మహారాష్ట్ర గవర్నర్ (2014-19), తమిళనాడుకు ఇన్‌ఛార్జిగా (కరీంనగర్ జిల్లా వాసి)
18. సరోజిని నాయుడు - యునైటెడ్ ప్రావిన్సెస్ గవర్నర్ (నేటి ఉత్తర్‌ప్రదేశ్) (1947-49) (హైదరాబాద్)
19. పద్మజా నాయుడు - పశ్చిమ బెంగాల్ గవర్నర్ (1956-1967) (హైదరాబాద్ వాసి)
20. పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా - ఒడిశా గవర్నర్ (1954-56) (తమిళనాడు)
21. బండారు దత్తాత్రేయ - హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ (2019-21), హరియాణా గవర్నర్ (2021-2025) (హైదరాబాద్ జిల్లా వాసి)
22. కంభంపాటి హరిబాబు - మిజోరం, త్రిపుర, ఒడిశా గవర్నర్ (2021-ప్రస్తుతం) (ప్రకాశం జిల్లా వాసి)
23. ఇంద్రసేనా రెడ్డి - త్రిపుర గవర్నర్ (2023)- (సూర్యాపేట జిల్లా వాసి)
ఇవి కూడా చదవండి
ఏడాదిగా కృషి.. గంజాయిని నియంత్రించాం: హోంమంత్రి అనిత
అధికారం కోసం ఏమైనా చేస్తారు.. జగన్‌పై యనమల ఫైర్
Read Latest AP News And Telugu News