Chandrababu: దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తా.. సీఎం చంద్రబాబు భరోసా
ABN , Publish Date - Dec 03 , 2025 | 08:02 PM
దేశంలో ఎక్కడా కూడా పింఛన్లకు రూ.6 వేలు ఇచ్చే ప్రభుత్వం లేదని.. ఒక్క ఏపీలో మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రూ.3 వేల పింఛన్‌ను రూ.6వేలకు పెంచామని గుర్తుచేశారు.
విజయవాడ, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడా కూడా పింఛన్లకు రూ.6 వేలు ఇచ్చే ప్రభుత్వం లేదని.. ఒక్క ఏపీలో మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. రూ.3 వేల పింఛన్‌ను రూ.6వేలకు పెంచామని గుర్తుచేశారు. 63లక్షల 50వేల మందికి ప్రతి నెలా ఒకటో తేదీనే ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇస్తున్నామని వివరించారు. దివ్యాంగులపై తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్‌మెంట్ ఇదని పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులు కాబట్టే... అనేక రంగాల్లో రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ(బుధవారం) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పలువురు దివ్యాంగులను సన్మానించారు. అనంతరం ప్రసంగించారు సీఎం చంద్రబాబు.
ఆదర్శవంతులను అభినందించాలి..
‘ఏడాదికి రూ.6వేల కోట్లు పెన్షన్ రూపంలో అందిస్తున్నాం. బ్యాక్ లాగ్ పోస్టులకు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ పొడిగిస్తున్నాం. ఎన్ని అడ్డంకులు ఉన్నా వైకల్యం అడ్డుకాదని ఇక్కడ ఉన్న కొంతమంది నిరూపించారు. అలాంటి ఆదర్శవంతులను అభినందించాలి. ఆశీర్వదించాలి. దృష్టి లోపం ఉన్నా కరుణా కుమారి పట్టుదలతో రాణించి అవార్డు సాధించారు. అంతర్జాతీయ ప్రపంచ కప్ క్రికెట్‌లో 42 పరుగులు సాధించి భారత్‌కు కప్ అందించారు. ఆమె ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదివి ఈ స్థాయికి చేరిందంటే నేను గర్విస్తున్నా. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని స్పూర్తి పొందాలి. అజయ్ కుమార్ రెడ్డి అర్జున అవార్డు సాధించడం గొప్ప విషయం. కర్ణాటక తరపున ఆడిన దీపిక మన రాష్ట్రంలో పుట్టారు. కంటి చూపు పోయినా అధైర్య పడకుండా క్రికెట్‌లో, వంద మీటర్ల పరుగులో రాణించారు.నేడు మెగాడీఎస్సీ ద్వారా 2వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
డిజేబుల్ స్పోర్ట్స్ ఏర్పాటు..
‘విశాఖపట్నంలో నేషనల్ సెంటర్ పర్ డిజేబుల్ స్పోర్ట్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. కరుణ కుమారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరపున రూ. 5లక్షలు, మరో రూ. 5 లక్షలు, అంధుల క్రికెట్ అసియేషన్ ఒక లక్షతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.15లక్షలు, ఇళ్లు కట్టిస్తున్నాం. అజయ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వం తరపున రూ.2 లక్షలు, ఎసీఏ తరపున లక్ష ఇస్తున్నాం. దీపికకు రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇంద్రధనస్సు రంగుల్లా మీ జీవితాలు బాగుండాలని, ఏడు వరాలు ఇస్తున్నాం. దివ్యాంగులు అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో గెలుస్తారు.. ఓటమి చెందితే.. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రాధాన్యత ఇస్తాం.ప్రజాసేవకు దివ్యాంగులు అన్ని విధాలా సమర్థులని చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఇచ్చేలా దివ్యాంగులకు కూడా రూ.19 కోట్లు కేటాయించి రుణాలు ఇస్తాం. క్రీడల్లో రాణించేలా అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. టిడ్కో ఇళ్లు ఎక్కడ ఇచ్చినా.. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. వినికిడి లోపం ఉన్న వారికి ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తాం. రెసిడెన్షియల్ విద్యార్థులు ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అమరావతిలో స్వేచ్చగా తిరిగేలా ఏర్పాట్లు..
‘అమరావతితో సహా అన్ని జిల్లాల్లో విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవనం ఏర్పాటు చేస్తాం. విభిన్న ప్రతిభావంతుల భవన్‌లో మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రజా రాజధాని అమరావతిలో స్వేచ్చగా తిరిగేలా ఏర్పాట్లు చేస్తాం. మీకు అండగా, తోడుగా నేను ఉంటా.. మిమ్మలను ముందుకు నడిపిస్తా. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి.. మిమ్మలను ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎంత బిజీగా ఉన్నా మీతో మమేకం అయ్యి, మీకు ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈకార్యక్రమానికి వచ్చాను. 2019 నుంచ 2024 మధ్య ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు చూశారా.. దివ్యాంగులకు సభ పెట్టారా అని అడుగుతున్నా. ఒక్క రూపాయి అయినా మీకు సాయం చేశారా ఆలోచన చేయండి. దివ్యాంగులపై కక్ష కట్టి దాడులు చేశారు తప్ప.. మిమ్మలను ఆదుకోలేదు. నేను మీకు అండగా ఉంటాను.. తప్పకుండా మీకు ప్రభుత్వం అన్ని విధాలా చేయూతను ఇస్తుంది’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్
శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం..
Read Latest AP News and National News