Amit Shah: విజయవాడలో అమిత్ షా పర్యటన
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:34 AM
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు, రేపు విజయవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు. ఈ మేరకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.

పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తాం: సీపీ రాజశేఖర్ బాబు
గుణదల, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్ షా నగర పర్యటనకు వస్తున్నందున శని, ఆదివారాల్లో నగరంలో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తామని నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు తెలిపారు. అమిత్ షా రాకను పురస్కరించుకుని నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై అధికారులతో సీపీ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అమిత్‌షా శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గాన విజయవాడ మీదుగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారని తెలిపారు.
అక్కడ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, పలువురు మంత్రులతో కలిసి భోజనం చేస్తారన్నారు. అక్కడ నుంచి తిరిగి నగరంలోని నోవోటెల్‌కు చేరుకుని అక్కడ రాత్రికి బసచేయనున్నట్లు తెలిపారు. నోవోటెల్ పరిసర ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. అమిత్ షా పర్యటనలో ఉన్న సమయంలో నగరంలోని ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని ప్రభుత్వశాఖలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఆదివారం ఉదయం ఆయన కృష్ణా జిల్లాలోని ఎన్డీఆర్‌ఎఫ్ వారి నిదం క్యాంపస్ ప్రారంభ కార్యక్రమానికి వెళతారని తెలిపారు. డీసీపీ గౌతమి షాలి, ఉదయరాణి, కృష్ణమూర్తినాయుడు, ప్రసాద్, సబ్ కలెక్టర్ చైతన్య, ఏడీసీపీలు ఎం.రాజారావు, ప్రసన్నకుమార్, ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.