AP Capital: అమరావతిలో ఏ ఏ సంస్థలకు ఎంత భూమిని కేటాయించారంటే
ABN , Publish Date - Jun 23 , 2025 | 01:04 PM
AP Capital: ఏపీ అమరావతిలో భూములు కేటాయించిన సంస్థలకు టైమ్ లైన్ ప్రకారం నిర్మాణం చేయాలని మంత్రి నారాయణ తెలిపారు. 2014- 2019 కాలంలో 130 సంస్థలకు 1270 ఎకరాలు ఇచ్చామని.. ఈ సంస్థల్లో కొంత మంది మాత్రమే నిర్మాణాలు చేపట్టారని చెప్పారు.

అమరావతి, జూన్ 23: రాజధానిలో (AP Capital Amaravati) సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించి ఈరోజు (సోమవారం) మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ (Minister Narayana) మాట్లాడుతూ.. 16 అంశాలకు గాను 12 అంశాలు మంత్రివర్గ ఉప సంఘంలో ఆమోదం పొందాయన్నారు. 2014- 19 కాలంలో రాజధానిలో భూములు కేటాయించిన సంస్థల్లో నాలుగు సంస్థలను కొనసాగిస్తూ ఆమోదం తెలిపామన్నారు. సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు రెండు ఎకరాల కేటాయింపును కొనసాగిస్తూ ఆమోదం తెలిపామన్నారు.
జుయలాజికల్ ఆఫ్ సర్వే సంస్థకు రెండు ఎకరాల కేటాయింపును కొనసాగిస్తూ అంగీకారం తెలిపినట్లు చెప్పారు. అలాగే స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు ఐదు ఎకరాల కేటాయింపు కొనసాగిస్తూ ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు మూడు ఎకరాల కేటాయింపును కొనసాగిస్తూ అంగీకారం తెలిపామని.. ఈ నాలుగు సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్ చేసి ఆమోదించినట్లు మంత్రి చెప్పుకొచ్చారు.
2014- 19లో కేటాయించిన రెండు సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేశామన్నారు. గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్బత్తికి భూ కేటాయింపులు రద్దు చేశామన్నారు. కొత్తగా ఆరు సంస్థలకు భూ కేటాయింపులు చేశామన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు రెండు ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు రెండు ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.4 ఎకరాలు, ఇంటలిజెన్స్ బ్యూరో (SIB)కు 0.5 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్‌కు 0.5 ఎకరాలు, బీజేపీ పార్టీకి రెండు ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు.
భూములు కేటాయించిన సంస్థలకు టైమ్ లైన్ ప్రకారం నిర్మాణం చేయాలన్నారు. 2014- 2019 కాలంలో 130 సంస్థలకు 1270 ఎకరాలు ఇచ్చామని.. ఈ సంస్థల్లో కొంత మంది మాత్రమే నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన మిగిలినవారు ఎవరూ నిర్మాణాలకు ముందుకు రాలేదని.. అందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోయారన్నారు. గత ప్రభుత్వం ఆడిన మూడు ముక్కలాటతో అందరూ భయపడ్డారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో అనేక మంది భూ కేటాయింపులకు అప్లై చేశారని.. అందులో 64 సంస్థలకు 884 భూ కేటాయింపులు చేశామన్నారు. ఈరోజు పది సంస్థలకు భూ కేటాయింపులు చేశామని తెలిపారు. గతంలో కేటాయించిన సంస్థలకు టైం బాండ్ ముగిసిందని చెప్పారు. మంత్రివర్గ ఉప సంఘంలో మరోసారి చర్చకు పెట్టి రివైజ్ చేసుకుంటూ వస్తున్నామని మంత్రి తెలిపారు.
భూములు కేటాయించిన సంస్థలకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం కేటాయించామన్నారు. భూములు కేటాయించిన సంస్థల వద్ద నుంచి ప్రారంభానికి టైం షెడ్యూల్ తీసుకున్నామని.. రాబోయే రెండు మూడు నెలల్లో అన్ని సంస్థలు నిర్మాణాలు చేపట్టనున్నాయని తెలిపారు. కేటాయించిన సమయంలో నిర్మాణాలు చేపట్టకపోతే భూములు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో పిలిచిన అన్ని టెండర్స్‌కు పనులు మొదలయ్యాయన్నారు. ప్రస్తుతం 10,000 మందికి పైగా కార్మికులు అమరావతిలో పనిచేస్తున్నారన్నారు. వచ్చే నెల చివరి నాటికి 20 వేల మంది కార్మికులు పనిచేయటానికి అందుబాటులోకి వస్తారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు మంత్రి భరత్, అధికారులు హాజరవగా.. జూమ్ ద్వారా మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సింగయ్య మృతిపై లోతైన దర్యాప్తు.. విచారణకు జగన్ సెక్యూరిటీ
చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు
వృద్ధురాళ్ల హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు
Read Latest AP News And Telugu News