Guntur Case: వృద్ధురాళ్ల హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..
ABN , Publish Date - Jun 23 , 2025 | 10:53 AM
Guntur Case: తెనాలిలో ఇద్దరు వృద్ధురాళ్ల హత్య కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

గుంటూరు, జూన్ 23: జిల్లాలోని తెనాలిలో సంచలనం సృష్టించిన ఇద్దరు వృద్ధ మహిళల హత్య కేసును పోలీసులు చేధించారు. స్కెచ్ వేసి మరీ బంగారం, నగదు కోసం వృద్ధురాళ్లను నిందితులు దారుణంగా హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. హత్యకు పాల్పడిన పెరవలి కుసుమ కుమారి, ఇల్ల గోపి, మరో మైనర్ బాలుడిని త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జంట హత్యల కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. గతంలో బంగారం కోసం మారిస్ పేటకు చెందిన మహిళను మహిళా నిందితురాలు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అది వెలుగులోకి రాకపోవటంతో అదే తరహాలో డబుల్ మర్డర్‌కు ప్లాన్ చేశారు ముగ్గురు నిందితులు. నిందితుల నుంచి రూ.34,500 నగదు, బంగారపు తాడు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. నాలుగు రోజుల క్రితం ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళల హత్య తీవ్ర కలకలం రేపింది. పట్టపగలే రాజేశ్వరి (65), ఆమె వియ్యపురాలు అంజమ్మ (70)ను దుండగులు దారుణంగా హత్య చేశారు. తెనాలి శివారు పరిమిడొంక రోడ్డులో రాజేశ్వరి, అంజమ్మలు తమ భర్తలు మరణించాక ఒకరికి ఒకరు తోడుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే పథకం ప్రకారం ముగ్గురు వ్యక్తులు వారి ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరు మహిళలను హత్య చేసి బంగారాన్ని అపహరించారు. వీరి వచ్చి వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఓ మహిళ, ఇద్దరు యువకులు ఆటోలో వచ్చి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. హత్యకు గురైన ఇద్దరు మహిళల పిల్లలు ఉద్యోగ రీత్యా వేరే ప్రదేశాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో గత గురువారం రాజేశ్వరి కుమార్తె తల్లికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో బంధువులకు సమాచారం అందించారు. వాళ్లు వెళ్లి చూడగా ఇద్దరూ కూడా విగతజీవులుగా పడి ఉన్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా బంగారం కోసం ఇద్దరు వృద్ధురాళ్లను హత్య చేసినట్లు అంగీకరించారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్ నిర్ణయంతో షాక్.. చైనా సాయం కోరిన అమెరికా
వైసీపీ కార్యకర్తలపై జగన్ కామెంట్ల ప్రభావం
కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం సిగ్గుచేటు..
Read Latest AP News And Telugu News