Minister Savita: అధికారం పోయాక జగన్‌కు ప్రజలు గుర్తుకొచ్చారు
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:25 AM
ఐదేళ్ల పాలనలో ప్రజల బాగోగుల గురించి జగన్ ఆలోచించిన పాపాన పోలేదని, అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు ప్రజలు గుర్తుకొస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు.

బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పెనుకొండ టౌన్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల పాలనలో ప్రజల బాగోగుల గురించి జగన్ ఆలోచించిన పాపాన పోలేదని, అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు ప్రజలు గుర్తుకొస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో రూ.60 లక్షలతో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్‌కు ఎంపీ బీకే పార్థసారథితో కలిసి ఆమె శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
రప్పా రప్పా నరుకుతామని అనడంలో తప్పేముందని మాజీ సీఎం జగన్ మీడియా సమావేశంలో రెచ్చగొట్టేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. శవ రాజకీయాలు తప్ప జగన్ ఐదేళ్లు చేసిందేమీలేదని, వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలని, ఆయన క్షుద్ర రాజకీయాలకు బలికావద్దని సూచించారు. ఉనికి చాటుకోవడానికి జగన్ దేనికైనా సిద్ధంగా ఉన్నారని, తాము అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.