YS Jagan: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 22 , 2025 | 02:14 PM
YS Jagan: ఏపీలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇలానే కొనసాగితే అరాచకం తప్ప ఏమీ కనిపించదని విమర్శించారు. ఎంపీ మిథున్‌రెడ్డిని టార్గెట్ చేసి ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని చెప్పారు. తప్పుడు సాక్ష్యాలతో ఇబ్బంది పెడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.

అమరావతి: ఏపీలో ఒక భయాన్ని సృష్టించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాసమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి గురించి ప్రజల్లోకి రాకుండా ఈ ప్రభుత్వం తాపత్రయం పడుతోందని విమర్శించారు. ఇవాళ (మంగళవారం) పీఏసీ సమావేశంలో వైసీపీ అధినేత జగన్ పాల్గొని మాట్లాడారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్టు చేయడం పరాకాష్టకు నిదర్శనమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
భయపెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు..
ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసుల అధికారుల పట్ల ప్రభుత్వం తీరును కోర్టు తప్పుబట్టిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుచేశారు. మొదటిసారిగా ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నానని అన్నారు. చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారని .. దీనికోసం మనుషులను భయపెడుతున్నారని ఆరోపించారు. వారిని ప్రలోభపెట్టి, భయపెట్టి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడంలేదని.. వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని విమర్శలు చేశారు. ఒక దుర్మార్గపు సంప్రదాయాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
మిథున్‌ను టార్గెట్ చేశారు..
‘మన లోక్‌సభ సభ్యుడు మిథున్‌ను టార్గెట్ చేసి, ఎలాగైనా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. తన కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి, చంద్రబాబు పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. లేని ఆరోపణలు సృష్టించి, తప్పుడు సాక్ష్యాలు పెట్టి.. వారిని ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై సీఐడీ గతంలో కేసు కూడా పెట్టింది.. మరి ఏది స్కాం.. ప్రభుత్వం అన్యాయలను గట్టిగా ప్రయత్నించాలి. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా.. లేదా అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా. లిక్కర్ విధానం విప్లవాత్మకమైనది. ప్రైవేటు దుకాణాలు తీసేసి, ప్రభుత్వమే నిర్వహించింది.. అమ్మకాల సమయాలను తగ్గించింది. లిక్కర్ టాక్స్‌లు పెంచాం, దీనివల్ల రేట్లు పెరిగాయి, అమ్మకాలు తగ్గాయి. మరి ఎవరి హయాంలో స్కాంలు జరిగాయి. దేన్నీ వదిలిపెట్టడం లేదు. వైసీపీ మీద బురదజల్లి, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్‌లను పెట్టి… గ్యాలరీల్లో ప్రజలను పెట్టి, మనుషులను చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆటలు పెట్టి.. ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. దీనివల్ల ప్రజలు తమ కష్టాలను, బాధలను వదిలేస్తారని అభిప్రాయం. విశాఖలో రూ.3వేల కోట్ల భూమిని ఊరు, పేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు’ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇంత దోపిడీని చూడలేదు...
‘లులూ గ్రూపునకు రూ.1500 నుంచి 2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్ రేట్లు పెరిగాయి. రూ.36 వేల కోట్ల పనులను ఇప్పుడు రూ. 77 వేలకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు తీసుకువచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో మనం చేసినట్లుగా ఎందుకు బటన్‌లు నొక్కలేదని అడిగాను. బటన్‌లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోంది. అందుకనే చంద్రబాబు బటన్‌లు నొక్కడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లో ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నారు. ఏమీలేకపోతే.. జగన్‌మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేయిస్తున్నారు. ప్రజల నోటిలోకి నాలుగేళ్లు ఇప్పుడు ఎందుకు పోవడం లేదు. గత ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దుచేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ. 3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదు. ప్రతి క్వార్టర్‌కు రూ. 700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతీ దీవెన కింద రూ.3900 కోట్ల బకాయిలను గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ కలుపుకుంటే రూ.7వేల కోట్లకు గాను రూ. 700 కోట్లు ఇచ్చారు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల భీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించాడు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్‌బుక్ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పీఏసీ గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది’ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP Leaders: దూకుడు పెంచిన కూటమి సర్కార్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్
IPS officer Anjaneyulu: కాదంబరి జత్వాని కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్
AP NEWS: ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ
High Court: చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలి
For More Andhra Pradesh News and Telugu News..