Share News

Varla Ramaiah: బాబాయిని చంపినోడికి సింగయ్య ఒక లెక్కా.. వర్ల రామయ్య ఫైర్

ABN , Publish Date - Jun 26 , 2025 | 09:44 PM

తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు కొల్లగొట్టి 16 నెలలు చంచలగూడ జైల్లో చిప్పకూడు తిన్న నేర చరిత్ర జగన్‌ది అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడిన జగన్‌కు 16 నెలలుగా బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించిందని గుర్తుచేశారు.

Varla Ramaiah: బాబాయిని చంపినోడికి సింగయ్య ఒక లెక్కా.. వర్ల రామయ్య ఫైర్
Varla Ramaiah

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయిని చంపినోడికి సింగయ్య ఒక లెక్కా అని ప్రశ్నించారు. ఇవాళ(గురువారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో వర్లరామయ్య మీడియాతో మాట్లాడారు. జగన్ మానసిక స్థితి చిన్ననాటి నుంచి ప్రశ్నార్థకమేనని విమర్శించారు. విద్యార్థిగా ప్రశ్నాపత్రాలు దొంగిలించారన్న ఆరోపణలపై ఇప్పటికీ అతని నుంచి సమాధానం లేదని అన్నారు. గతంలో పార్లమెంట్‌కు రాజీనామా చేయనని అన్నాడని.. లాలించి పెంచి ప్రేమించిన బాబాయిని లాగి చెంపపై కొట్టిన మనస్తత్వం జగన్‌ది అని ఆరోపించారు. గతంలో హైదరాబాద్‌కు రావద్దని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారించినా జగన్ బెంగళూరులో ఉండకుండా పదే పదే హైదరాబాద్‌కు వచ్చి తండ్రికి తలనొప్పి కలిగించారని విమర్శించారు వర్ల రామయ్య.


తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు కొల్లగొట్టి 16 నెలలు చంచలగూడ జైల్లో చిప్పకూడు తిన్న నేర చరిత్ర జగన్‌ది అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఆర్థిక నేరస్థుడిగా ముద్రపడిన జగన్‌కు 16 నెలలుగా బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతంతో జగన్ హయాంలోని ఐదేళ్లు కునారిల్లాయని మండిపడ్డారు. గడిచిన ఐదేళ్ల పాలన అరాచకం, అప్రజాస్వామికం, దౌర్జన్యం, రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. ప్రత్యర్థి పార్టీలను అణగతొక్కడమే లక్ష్యంగా సాగిన ఐదేళ్ల అప్రజాస్వామిక పాలన జగన్‌ది అని ఫైర్ అయ్యారు వర్ల రామయ్య.


పోలీసులు నిర్వహించే శవపంచనామాకు, డాక్టర్లు నిర్వహించే పోస్ట్‌మార్టానికి కూడా జగన్ పత్రిక సాక్షికి తేడా తెలియదని వర్ల రామయ్య సెటైర్లు గుప్పించారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించిన నేర ప్రవృత్తి జగన్‌ది అని మండిపడ్డారు. అధికారమే లక్ష్యంగా మానవత్వ విలువలకు తిలోదకాలు ఇచ్చిన అనైతిక వాది జగన్ అని ఆరోపించారు. తన కారు క్రింద సింగయ్య పడలేదు, తన కారుకు సింగయ్య చావుకు సంబంధం లేదని చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. సింగయ్యను వైసీపీ కార్యకర్తలే టైర్ క్రింద నుంచి లాగి పక్కన పడేయలేదని చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా అని నిలదీశారు. వైసీపీ నేతలు రోజా, అంబటి రాంబాబు, విడదల రజినీ లాంటి వాళ్లకు కళ్లముందు నిజం కనిపిస్తున్నా.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వారి అధినాయకుడు జగన్‌ రెడ్డి విపరీత మనస్తత్వం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు.


ఇవి కూడా చదవండి:

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు..

For More AP News and Telugu News

Updated Date - Jun 26 , 2025 | 09:57 PM