Pemmasani: గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Aug 01 , 2025 | 09:02 PM
గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాఘవేంద్రప్రసాద్, కల్యాణి దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.4 కోట్లు విరాళం ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. దాతల విరాళంలోని రూ.40 లక్షలతో బీసీల కమ్యూనిటీ భవన నిర్మానానికి శంకుస్థాపన చేశామని తెలిపారు.

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Pemmasani Chandrasekhar) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇవాళ(శుక్రవారం) పొన్నూరు మండలం మామిళ్ళపల్లిలో రూ.40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. రాఘవేంద్రప్రసాద్, కల్యాణి దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.4 కోట్లు విరాళం ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. దాతల విరాళంలోని రూ.40 లక్షలతో బీసీల కమ్యూనిటీ భవన నిర్మానానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. బీసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఈ భవన నిర్మాణ శంకుస్థాపన చేపట్టిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
అంతకుముందు.. గుంటూరు నగరాభివృద్ధిపై నగర కార్పొరేషన్‌లో ఇవాళ(శుక్రవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరు నగరంలోని సమస్యలపై ప్రతి మూడు నాలుగు వారాలకు సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. శంకర్ విలాస్ బ్రిడ్జి పనుల్లో నష్టపోయిన 74 మందికి నష్టపరిహారం అందించామని గుర్తుచేశారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.
ఎనిమిది నెలల్లో నంది వెలుగు బ్రిడ్జి పూర్తి చేస్తామని సంబంధిత పనుల కాంట్రాక్టర్ చెప్పారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. సెప్టెంబర్‌లో ఇన్నర్ రింగ్ రోడ్డు థర్డ్ ఫేజ్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పీవీకే నాయుడు మార్కెట్ స్థానంలో రూపొందించిన డిజైన్ నచ్చలేదని చెప్పారు. ఆ డిజైన్ మార్చాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గుంటూరు నగరంలో శానిటేషన్ బాగా ఇంప్రూవ్ అయిందని తెలిపారు. నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. మూడు వంతెనల వద్ద నీరు నిల్వకుండా చేయాలంటే 200 ఆక్రమణలను తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. దీర్ఘకాలిక ప్రక్రియలో భాగంగా ఆక్రమణలను తొలగిస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
బీసీల ఆత్మగౌరవం నిలబెట్టడానికే తమ ప్రభుత్వం పనిచేస్తోంది: ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఏపీ అభివృద్ధికి విరాళం ప్రకటించిన దాతల సహకారం అభినందనీయమని తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవం నిలబెట్టడానికే తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఉద్ఘాటించారు. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను కేంద్ర మంత్రి పెమ్మసాని ద్వారా పరిష్కరించడం అభినందనీయమని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు రిమాండ్ పొడిగింపు
చేనేతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
For More AP News and Telugu News