Kota Srinivasa Rao: కోట మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు.. పలువురు ప్రముఖుల సంతాపం
ABN , Publish Date - Jul 13 , 2025 | 09:15 AM
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు బాధపడుతూ.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) (Kota Srinivasa Rao Death) ఇవాళ(ఆదివారం, జులై13)న ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు బాధపడుతూ.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు.
కోట శ్రీనివాసరావు పోషించిన పాత్రలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు
వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి విచారకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమని గుర్తుచేసుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కోట పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయని స్మరించుకున్నారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని చెప్పుకొచ్చారు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కోట శ్రీనివాసరావు విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సంతాప ప్రకటన విడుదల చేశారు ముఖ్యమంత్రి. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటని చెప్పారు. కోట కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కోటా శ్రీనివాసరావు విలక్షణ వెండితెర నటుడు : కేసీఆర్
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సంతాప ప్రకటన విడుదల చేశారు కేసీఆర్. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట అని ఉద్ఘాటించారు. కోట మరణంతో సినిమా రంగం గొప్ప నటుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలుగు భాష, యాసలపై కోట శ్రీనివాసరావుకి మంచి పట్టు: పవన్‌కల్యాణ్
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. కోట ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. తెలుగు తెరపై ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారని గుర్తుచేసుకున్నారు. తెలుగు భాష, యాసలపై ఆయనకు మంచి పట్టు ఉందని ఉద్ఘాటించారు. పిసినారిగా, క్రూరమైన విలన్‌గా, మధ్య తరగతి తండ్రిగా, అల్లరి తాతయ్యగా… ఏ పాత్రలోనైనా కోట ఒదిగిపోయారని స్మరించుకున్నారు. 1999-2004 మధ్య శాసన సభ్యుడిగా సేవలందించారని గుర్తుచేసుకున్నారు. కోట శ్రీనివాసరావుతో తమ కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అన్నయ్య చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదుతోనే కోట చిత్ర సీమకు పరిచయం అయ్యారని చెప్పుకొచ్చారు. తన మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారని అన్నారు. ఆ తర్వాత గోకులంలో సీత, గుడుంబా శంకర్, అత్తరింటికి దారేది, గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో ఆయనతో కలసి నటించానని వెల్లడించారు. కోట శ్రీనివాసరావు డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెప్పుకొచ్చారు. కోట శ్రీనివాసరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కోటాతో ఆత్మీయ అనుబంధం ఉంది: కిషన్‌రెడ్డి
కోటా శ్రీనివాసరావు మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. విలక్షణ నటుడు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు కోటా శ్రీనివాస రావు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. వారు అనేక అంశాలపై లోతైనా అవగాహన కలిగిన వ్యక్తి వారితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని ఉద్ఘాటించారు. సనాతన ధర్మం, సామాజిక విలువలు, భాషా పరిరక్షణ తదితర విషయలపై సమాజంలో మరి ముఖ్యంగా యువతలో చైతన్యం నింపేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించి తెలుగు సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును చాటుకున్నారని చెప్పకొచ్చారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు. కోట సేవలను గుర్తించి 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించుకుందని ఉద్ఘాటించారు. ఆయన మృతి సినీ రంగానికి తెలుగు సమాజానికి తీరనిలోటని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కోట శ్రీనివాసరావుది ప్రత్యేకస్థానం: మంత్రి నారా లోకేష్
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారని ప్రశంసించారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఉద్ఘాటించారు. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని స్మరించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటని చెప్పారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కోట శ్రీనివాసరావుది ప్రత్యేకస్థానం: నందమూరి బాలకృష్ణ
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నానని సినీనటుడు, తెలుగుదేశం హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారని స్మరించుకున్నారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఉద్ఘాటించారు. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని ప్రశంసించారు.. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటని చెప్పుకొచ్చారు. కోట పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు మంత్రి పరామర్శ
For More AP News and Telugu News