Minister Kandula Durgesh: ఏపీలో పర్యాటక పెట్టుబడులకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:16 PM
Minister Kandula Durgesh: సీఎం చంద్రబాబు పర్యాటక రంగపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

అమరావతి: జర్మనీలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. పలువురు పెట్టుబడిదారులతో ఇవాళ(బుధవారం) ప్రత్యేకంగా మంత్రి కందుల దుర్గేష్ భేటీ అయ్యారు. ఏపీ పర్యాటకాభివృద్ధి అవకాశాలు, వనరుల గురించి మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై వరల్డ్ మీడియా ప్రతినిధులకు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఐటీబీ బెర్లిన్ -2025 సదస్సుకు హాజరుకావడం సంతోషంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు బెర్లిన్ సదస్సు ఉపకరిస్తుందని భావిస్తున్నామని మంత్రి దుర్గేష్ చెప్పుకొచ్చారు. దక్షిణ భారతదేశ పర్యాటకానికి ఏపీ ముఖద్వారమని పేర్కొన్నారు. ఏపీలో దాదాపు 1000 కిలోమీటర్ల సుదీర్ఘ విశాల సముద్రతీరం,అందమైన బీచ్‌లు, ఎత్తైన హిల్ ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని మంత్రి దుర్గేష్ చెప్పారు.
సాహస పర్యాటకం, చారిత్రక వారసత్వ సంపద, సుందరమైన తీర ప్రాంత సమ్మేళనంతో కూడిన ఏపీని యూరోపియన్, ప్రపంచ పర్యాటకులు చూడాల్సిన ప్రాంతమని అన్నారు. ఏపీలో ప్రపంచ ప్రఖ్యాత తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందని, అత్యధిక పర్యాటకులు సందర్శించిన ప్రదేశంగా నిలిచిందని తెలిపారు. ఏపీలో అమరావతి, నాగార్జున కొండ లాంటి బుద్ధిజానికి ప్రతీకగా నిలిచిన అనేక ప్రదేశాలున్నాయని అన్నారు. ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కృషి చేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన, సుస్థిర వృద్ధిరేటు, యువతకు ఉపాధి కల్పన, స్థానిక జన సమూహాల భాగస్వామ్యంతో పర్యాటకం అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులపై దృష్టి సారించామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఏపీలో రుషికొండ, రామకృష్ణ, మైపాడు, సూర్యలంక తదితర అందమైన బీచ్‌లున్నాయని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.
లగ్జరీ రిసార్ట్స్, వెల్‌నెస్ కేంద్రాలు, సాహస, ఏకో పర్యాటక అభివృద్ధికి ఏపీలో అద్భుతమైన వనరులు ఉన్నాయని మంత్రి దుర్గేష్ చెప్పుకొచ్చారు. గ్రామీణ పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించామని తెలిపారు. గిరిజనుల జీవన విధానానికి కళ్లకు కట్టినట్లు చూపించే అరకు వ్యాలీ ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉందని అన్నారు. పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఎత్తైన కొండ ప్రాంతాలున్న అరకులో ప్రత్యక్షంగా గిరిజనులతో పర్యాటకులు సంభాషించేందుకు అవకాశముందని మంత్రి దుర్గేష్ చెప్పారు. వ్యర్థ ఘన పదార్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి తద్వారా పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఏపీ పర్యాటక రంగ అవకాశాలపై మంత్రి కందుల దుర్గేష్ వివరణపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
AP Council: వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించిన మంత్రులు
Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అసలు కారణమిదే
Read Latest AP News And Telugu News