Share News

Minister Kandula Durgesh: రుషికొండపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Mar 01 , 2025 | 09:20 PM

Minister Kandula Durgesh: రాష్ట్రంలో త్వరలోనే బీచ్‌లను అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కాకినాడ, సూర్యలంక, మైపాడ్ , మచిలీపట్నం బీచ్‌లకు బ్లూఫాగ్ సర్టిఫికెట్‌ల కోసం కృషి చేస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ పర్యాటకులు ఏపీకి వచ్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Minister Kandula Durgesh: రుషికొండపై ఏపీ ప్రభుత్వం కీలక  నిర్ణయం
Minister Kandula Durgesh

అమరావతి: అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఏపీ పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులలో టూరిజం ఇన్వెస్టర్ సమ్మిట్‌లు నిర్వహిస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా, నూతన పర్యాటక పాలసీ, పీపీపీ విధానాలు ఊతమిస్తోన్నాయని వివరించారు. రుషికొండ ప్యాలెస్‌పై ఏప్రిల్, మేలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రుషికొండ ప్యాలెస్‌ను జగన్ ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం కడితే తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగిస్తామని స్పష్టం చేశారు. సుస్థిర, బాధ్యతాయుత, సమగ్ర, పర్యావరణహిత పర్యాటక విధానాలతో ఏపీకి అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడుల ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. పర్యాటక పెట్టుబడుల కోసం మంత్రి కందుల దుర్గేష్ జర్మనీలో పర్యటించనున్నారు. మార్చి 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జర్మనీలో జరిగే ఐటీబీ బెర్లిన్ -2025 సదస్సుకు హాజరుకానున్నారు. ఈ మేరకు మంత్రి దుర్గేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలున్నప్పటికీ కూడా అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రత్యేకతను వివరించమని ప్రోత్సహించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.


ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ... జర్మనీలోని బెర్లిన్ ఎక్స్ పో సెంటర్ సిటీ వేదికగా ఇన్వెస్టర్లకు ఏపీకి రావాలని ఆహ్వానం పలుకుతామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక వాణిజ్య ప్రదర్శన ఇంటర్నేషనల్ టూరిజం బోర్స్ బెర్లిన్‌లో పర్యాటక మంత్రిగా తాను, ఎండీ ఆమ్రపాలి పాల్గొని బెర్లిన్ వేదికపై రాష్ట్ర ప్రత్యేకతలు తెలిపి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తామని వెల్లడించారు. అడ్వెంచర్, కల్చర్, లగ్జరీ, మెడికల్, హెల్త్, ఎంఐసీఈ, టెక్నాలజీ, లగ్జరీ ట్రావెల్, టూరిజం సెక్టార్‌లో ఉపాధి అవకాశాల కల్పన, ప్రపంచ గమ్యస్థానంగా స్థానిక ప్రాంతాలను ఎలా తీర్చిదిద్దాలి వంటి అంశాలకు మార్గదర్శకత్వంగా ఐటీబీ బెర్లిన్ నిలవనుందని చెప్పుకొచ్చారు. భారీ స్థాయిలో పర్యాటక పెట్టుబడులు రాబట్టడం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. పర్యాటకానికి సాంకేతిక అనుసంధానం చేస్తామన్నారు. ఏపీ అభివృద్ధి గురించి వివరించేలా జర్మనీలో వరుస సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.30 మందికి పైగా పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం ఉంటుందని చెప్పారు. వరల్డ్ మీడియాతో నిర్వహించే పత్రికా సమావేశంలో ప్రసంగించి తద్వారా అంతర్జాతీయంగా ఏపీ పర్యాటక రంగం గురించి తెలిసేలా చేస్తానని మంత్రి దుర్గేష్ అన్నారు. ఐటీబీ బెర్లిన్ వేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పర్యాటక పాలసీ 2024-29 పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా, పీపీపీ విధానం, పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు కల్పించే ప్రోత్సాహకాలు, రాయితీలను వివరించి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తానని వెల్లడించారు.


రాష్ట్రంలో త్వరలోనే బీచ్‌లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కాకినాడ, సూర్యలంక, మైపాడ్ , మచిలీపట్నం బీచ్‌లకు బ్లూఫాగ్ సర్టిఫికెట్‌ల కోసం కృషి చేస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ పర్యాటకులు ఏపీకి వచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. టూరిజంతో పాటు ట్రావెల్ రంగం అభివృద్ధి కూడా ముఖ్యమన్నారు. ఎయిర్ పోర్ట్‌ల సంఖ్య పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పర్యాటక ప్రాంతాల్లో సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతుల కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు మెచ్చి వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే ఒబెరాయ్, మేఫైర్, తాజ్, ఎట్మాస్పియర్ గ్రూపులు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని హరిత రిసార్ట్స్ టాప్ క్లాస్ రిసార్ట్‌లుగా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో పర్యాటకంగా 50వేల గదులు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి 5000 గదులు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పర్యాటక అభివృద్ధిని పక్కనబెట్టి వ్యక్తిగత దూషణలకే వైసీపీ ప్రభుత్వంలో పర్యాటక మంత్రి ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి జగన్ ప్రభుత్వం ఏనాడూ కృషి చేయలేదని మండిపడ్డారు. పర్యాటక, సాంస్కృతిక రంగాలపై కూటమి ప్రభుత్వ చొరవను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసించారని గుర్తుచేశారు. ఏప్రిల్ తర్వాత రాష్ట్ర పర్యాటకానికి కేంద్రం మరింత సాయం చేయనుందని అన్నారు. అఖండ గోదావరి, గండికోట తరహాలో మరో మూడు నాలుగు పెద్ద పర్యాటక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయనుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

Updated Date - Mar 01 , 2025 | 09:20 PM