Share News

CM Chandrababu: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం.. అభినందనలు తెలిపిన సీఎం, మంత్రి లోకేష్

ABN , Publish Date - Jul 26 , 2025 | 07:37 PM

గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. అశోక్‌గజపతిరాజుతో బాంబే హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు.

CM Chandrababu: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం.. అభినందనలు తెలిపిన సీఎం, మంత్రి లోకేష్
Ashok Gajapathi Raju Oath Ceremony

అమరావతి: గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) ఇవాళ(శనివారం జులై 26) ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. అశోక్‌గజపతిరాజుతో బాంబే హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణం చేయించారు. గోవా గవర్నర్‌ బంగ్లా దర్బార్‌ హాల్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, పలువురు ఏపీ మంత్రులు, అశోక్‌ కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజును గోవా సీఎం ప్రమోద్ సావంత్, మంత్రి లోకేష్ సత్కరించారు. అశోక్ గజపతిరాజుకి ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.


అశోక్ గజపతిరాజుకి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏ పదవి చేపట్టినా హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా అశోక్ గజపతి రాజు వ్యవహారిస్తారని కొనియాడారు. గోవా గవర్నర్‌గా నూతన బాధ్యతలను కూడా అంతే అంకితభావంతో, నిష్పక్షపాతంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ సీఎం చంద్రబాబు శుభాభినందనలు తెలిపారు.


అశోక్ గజపతిరాజుకి సన్మానించిన మంత్రి నారా లోకేష్

గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విద్య. ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) హాజరయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజుని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ని కూడా మర్యాద పూర్వకంగా కలిశానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడంలో టీడీపీ ముందుంది: ప్రణవ్ గోపాల్

ఉత్తరాంధ్రకి చెందిన అశోక్ గజపతి రాజుకి గోవా గవర్నర్ పదవి రావటం ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణమని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ ఉద్ఘాటించారు. చంద్రబాబు సారథ్యంలో ఉత్తరాంధ్ర నేతలకు అత్యున్నత గౌరవం దక్కిందని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఇవాళ(శనివారం) మీడియాతో ప్రణవ్ గోపాల్ మాట్లాడారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడంలోనే కాదు, ఇక్కడి నాయకులని ప్రోత్సహించటంలో కూడా టీడీపీ ముందు ఉంటుందని మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు ప్రణవ్ గోపాల్.


వెనుకబడిన ఉత్తరాంధ్ర నుంచి అశోక్ గజపతిరాజుకి గవర్నర్‌గా పదవి రావటం, కింజరపు రామ్మోహన్ నాయుడుని కేంద్ర విమానయాన మంత్రిని చేయటం, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సాధారణ కార్యకర్త కలిశెట్టి అప్పలనాయుడుని ఎంపీగా చేయటం టీడీపీకే సాధ్యమని నొక్కిచెప్పారు. ఉత్తరాంధ్రలో విద్యాసంస్థల స్థాపనకు, ఆలయాలకు వేల ఎకరాలను ధారాదత్తం చేసిన అశోక్ గజపతి రాజుని గత జగన్ ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేసిందని ధ్వజమెత్తారు. నీతి నిజాయితీలకు చిరునామాగా ఉన్న అశోక్ గజపతి రాజుని వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి వేధించటంతో పాటు అనేక రకాలుగా అవమానించారని ప్రణవ్ గోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు

లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 08:19 PM