Share News

AP Ministers: జగన్ అండ్ కో విచ్చలవిడిగా దోపిడీ, లూటీ చేశారు.. ఏపీ మంత్రుల ఫైర్

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:25 PM

ప్రైవేట్ చేతుల్లో ఉన్న లిక్కర్ వ్యాపారాన్ని జగన్ తన చేతుల్లోకి తీసుకున్నారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. మద్యం తయారీ దగ్గర నుంచి అమ్మకం దాకా అంతా జగనే పర్యవేక్షించారని ఆరోపించారు. చిరు వ్యాపారుల దగ్గర కూడా ఆన్‌లైన్ సేవలు ఉంటాయని... కానీ వేల కోట్ల వ్యాపారం చేసే లిక్కర్ షాపుల్లో ఎందుకు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.

AP Ministers: జగన్ అండ్ కో విచ్చలవిడిగా దోపిడీ, లూటీ చేశారు.. ఏపీ మంత్రుల ఫైర్
AP Ministers

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో (AP Liquor Scam Case) చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) వ్యాఖ్యానించారు. కూటమి నేతలు ఎవరూ, కక్షగట్టి ఎవరినీ అరెస్టులు చేయించడం లేదని, దీనికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డే ఉదాహరణ అని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్ధరాత్రి వెళ్లి ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. సిట్ ఏడాది పాటు ఇన్వెస్టిగేషన్ చేసి, పూర్తి ఆధారాలతోనే అరెస్టులు చేస్తుందని చెప్పుకొచ్చారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అనగానే వెంటనే వచ్చి లొంగిపోలేదని గుర్తుచేశారు. ఇవాళ(శుక్రవారం) అమరావతిలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.


ఆధారాలు పక్కాగా ఉండటంతో కోర్టులను ఆశ్రయించినా, న్యాయ స్థానాలు కూడా బెయిల్ తిరస్కరించిన తర్వాతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు క్లారిటీ ఇచ్చారు. ప్రైవేట్ చేతుల్లో ఉన్న లిక్కర్ వ్యాపారాన్ని జగన్ తన చేతుల్లోకి తీసుకున్నారని మండిపడ్డారు. మద్యం తయారీ దగ్గర నుంచి అమ్మకం దాకా అంతా జగనే పర్యవేక్షించారని ఆరోపించారు. చిరు వ్యాపారుల దగ్గర కూడా ఆన్‌లైన్ సేవలు ఉంటాయని... కానీ వేల కోట్ల వ్యాపారం చేసే లిక్కర్ షాపుల్లో మాత్రం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు మంత్రి నిమ్మల రామానాయుడు.


వైసీపీ ప్రభుత్వం పేరు చెప్పి జగన్ అండ్ కో విచ్చలవిడిగా దోపిడీ, లూటీ చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు. లిక్కర్‌లో దోచుకున్న వేలకోట్ల ప్రజాధనాన్ని తమ ప్రభుత్వం వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. శాండ్ పాలసీని ప్రైవేట్ పాలసీ చేసి జేపీ వెంచర్స్‌కి కట్టబెట్టారని ఆరోపించారు. కాలపరిమితి ముగిసినా నకిలీ వే బిల్లులతో వేల కోట్లు దోచుకున్నారని ఆక్షేపించారు. దోచుకున్న ప్రజా సొత్తును వెనక్కి తీసుకొచ్చి, ఏపీ ఆర్థిక పరిస్థితి నిలదొక్కుకునేలా చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.


జగన్ కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు: మంత్రి సత్యకుమార్

Health Minister Satya Kumar.jpg

మద్యం కుంభకోణంలో దారులు వేరైనా.. వేరు ఒక్కటేనని మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) విమర్శించారు. ఎక్కడ తీగ పట్టుకున్నా.. అసలైన వేరు వద్దకే వస్తోందని ఆరోపించారు. ఇవాళ(శుక్రవారం) సత్యసాయి జిల్లాలో మంత్రి సత్యకుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న సిట్ అధికారులు రూ. 11కోట్లు పట్టుకున్నారని.. ఇది రూ.3500కోట్ల లిక్కర్ స్కామ్ అని ఆరోపించారు. నాసిరకం మద్యం తాగి చనిపోయిన వారి ఆత్మలు గోషిస్తున్నాయని చెప్పుకొచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వేలాదిమంది మంచాన పడి నిర్జీవంగా ఉన్నారని తెలిపారు మంత్రి సత్యకుమార్.


నేరస్థులను, కుంభకోణాలు చేసిన నిందితులని పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే అరెస్టు చేయకూడదనేలా జగన్ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. జగన్ కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. కాల్ మనీ విషయంలో ఎవర్నీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇందులో ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నా వదలమని వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల పాత్ర ఉంటే ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేస్తామని స్పష్టం చేశారు. కాల్ మనీ బాధితులు ఎవరైనా సరే ధైర్యంగా ముందుకు రావాలని మంత్రి సత్యకుమార్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితులకు రిమాండ్ పొడిగింపు

చేనేతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

For More AP News and Telugu News

Updated Date - Aug 01 , 2025 | 06:29 PM