AP High Court: జర్నలిస్టు కృష్ణంరాజు కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:16 PM
జర్నలిస్టు కృష్ణంరాజు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. కృష్ణంరాజు మాట్లాడిన వీడియోలు తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి: జర్నలిస్టు కృష్ణంరాజు (journalist Krishnam Raju) బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) ఇవాళ(బుధవారం) విచారణ జరిగింది. కృష్ణంరాజు మాట్లాడిన వీడియోలు తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. అయితే.. అమరావతిపై సాక్షి ఛానల్ డిబేట్‌లో కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆయనను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.
ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు. పిటిషనర్‌పై నమోదైన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనని న్యాయస్థానానికి తెలిపారు. అయినప్పటికీ మేజిస్ట్రేట్ జ్యుడీషియల్ కస్టడీ విధించారని గుర్తుచేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మేజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. మహిళలను అవమానపరిచేలా పిటిషనర్ వ్యాఖ్యలు ఉన్నాయని వివరించారు. ఏ2గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన అనంతరం తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ జర్నలిస్టు కృష్ణంరాజు ప్రజలను రెచ్చగొట్టేలా మరో వీడియో విడుదల చేశారని మెండ లక్ష్మీనారాయణ వెల్లడించారు.
కొమ్మినేని శ్రీనివాసరావు కేసులో కీలక ఆదేశాలు
మరోవైపు.. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై (Kommineni Srinivasa Rao) తుళ్లూరు పోలీసులు పెట్టిన కేసును ప్రధాన కేసుగా పరిగణించాలని ఏపీ పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అనుచిత వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా నమోదైన ఇతర కేసులను స్టేట్‌మెంట్లుగా నమోదు చేయాలని సూచించింది. సాక్షి ఛానల్ డిబేట్‌లో అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కొమ్మినేనిపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆ కేసులు అన్నింటికీ ఒకే ఎఫ్ఐఆర్‌గా పరిగణించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొమ్మినేని శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తుళ్లూరు పోలీసులు నమోదు చేసిన మొదటి ఎఫ్ఐఆర్ మినహా ఇదే విషయంపై రాష్ట్ర వాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్‌లలో నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 162 కింద స్టేట్‌మెంట్లుగా పరిగణించాలని పోలీసులను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ మినహా ఇతర ఠాణాల్లో పోలీసులు నమోదు చేసిన కేసులు ఆధారంగా తదుపరి చర్యలు అన్నింటినీ హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర కేబినెట్‌లో చంద్రబాబు, లోకేష్‌ను మెచ్చుకున్న ప్రధాని
ప్రతీ కార్యకర్తను గౌరవిస్తాం: మంత్రి కొల్లు
Read latest AP News And Telugu News