AP High Court: మెడికల్ కాలేజీల పీపీపీ విధానం.. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం: ఏపీ హైకోర్టు
ABN , Publish Date - Oct 29 , 2025 | 07:32 PM
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. అది చట్టవిరుద్దం అయితే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని ఏపీ హై కోర్టు స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది.
అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు (PPP Model Medical Colleges) నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ (Andhra Pradesh Government) విధానపరమైన నిర్ణయమని.. అది చట్టవిరుద్దం అయితే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని ఏపీ హై కోర్టు (AP High Court) స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా అడ్డుకోవాలని పిటిషనర్ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.
కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చింది హైకోర్టు. తదుపరి విచారణని నాలుగు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ - 590ని సవాల్ చేస్తూ తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కొర్రా వసుంధర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైకోర్టులో వేసిన పిల్‌పై ఇవాళ(బుధవారం) విచారణ జరిగింది.
ఈ వ్యాజ్యంపై పిటీషన్ తరపున హైకోర్టులో సీనియర్ న్యాయవాది శ్రీరాం, మరో న్యాయవాది అశోక్ రాం వాదనలు వినిపించారు. టెండర్లు ఖరారు చేయకుండా స్టే ఇవ్వాలని న్యాయవాదులు అభ్యర్థించారు. న్యాయవాదుల అభ్యర్థనని తిరస్కరించింది హైకోర్టు. కాలేజీలు, ఆస్పత్రులను పీపీపీ విధానంలో చేపట్టాలని తీసుకున్న నిర్ణయంలో లాభ, నష్టాలను సమగ్రంగా పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవి: మంత్రి సత్యకుమార్
మొంథా తుఫాను ప్రమాదం తప్పింది.. కానీ చాలా నష్టపోయాం..
Read Latest AP News And Telugu News