AP Government: మామిడి రైతులకు చంద్రబాబు కానుక.. కిలోకు రూ.4ల సబ్సిడీ
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:38 AM
మామిడి కొనుగోలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మామిడి కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. మూడు జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

అమరావతి: మామిడి కొనుగోలుపై (Mango Purchase) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) ప్రత్యేక దృష్టి సారించింది. మామిడి కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Chandrababu Naidu) ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. ఇందుకోసం మూడు జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. 50వేల మందికి పైగా రైతుల నుంచి మామిడి కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకున్నారు. రైతుల నుంచి పర్లే, ఆగ్రో, కోకో కోలా, పెప్సీ వంటి సంస్థలు.. మామిడి కొనుగోలు చేసేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
మామిడి రైతులను ఆదుకునేందుకు రూ.130 కోట్లు విడుదల చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు మామిడి రైతుల విషయంలో సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో కేజీ రూ.12 చెల్లించి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 3,08,261 మెట్రిక్ టన్నుల మేర మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్ల వారు కొనుగోలు చేశారు. మొత్తంగా ఈ సీజన్‌లో 3,75,000 మెట్రిక్ టన్నుల మేర మామిడి ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. చిత్తూరు జిల్లాలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాలో 45 వేల మెట్రిక్ టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 మెట్రిక్ టన్నుల మేర మామిడి కొనుగోళ్లు చేశారు. ర్యాంపులు , మండీల ద్వారా మరో 81 వేల మెట్రిక్ టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయాలు జరిగాయి. మొత్తం 50,922 మంది రైతుల నుంచి మామిడి కొనుగోళ్లు అయ్యాయి.
ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మొత్తం 3.98 లక్షల హెక్టార్లలో రైతులు మామిడి సాగు చేశారు. రైతులకు అదనంగా కేజీకి రూ.4ల మద్దతు ధర ఇవ్వాలని గత నెలలోనే నిర్ణయించి ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు రూ.8 చెల్లించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా రైతులకు కేజీ మామిడికి రూ.12ల ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది మిగిలి పోయిన పల్ప్ ఉత్పత్తిని విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మామిడి రైతులను ఆదుకునేందుకు రూ.130 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి గత నెలలోనే ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్రప్రభుత్వం సాయం కోసం ఎదురుచూడకుండా....కేజీకి రూ.4 అదనంగా మద్దతు ధరని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవం.. చిన్నారులతో సరదాగా గడిపిన మంత్రి లోకేష్
తల్లి, చెల్లిని మోసం చేసిన జగన్ : మంత్రి సంధ్యారాణి
For More AP News and Telugu News