Share News

AP DGP Harish Kumar Gupta: లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

ABN , Publish Date - Jul 26 , 2025 | 04:48 PM

ఇటీవల ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని.. పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్‌‌లు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఏపీ పోలీసులు ఫీల్డ్ లెవల్లో బాగా పని చేసి మంచి ఫలితాలు చూపించారని చెప్పుకొచ్చారు. వయలెన్స్ పోతేనే ఎక్కడైనా అభివృద్ధి సాధ్యమవుతుందని.. అందుకే వీటి‌పై ప్రధానంగా దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టులకి కూడా నేడు రివార్డులు అందజేస్తున్నామని ప్రకటించారు. మావోయిస్టులు పునరాలోచన చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.

AP DGP Harish Kumar Gupta: లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..
Senior Maoist Couple Surrenders

విజయవాడ: ఇద్దరు మావోయిస్టు అగ్ర దంపతులు (Maoists Couple Surrenders) ఇవాళ(శనివారం జులై 24) సరెండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీలో సుమారు 34 సంవత్సరాలకు పైగా పనిచేసిన సీనియర్ మావోయిస్టులు జోరిగె నాగరాజు అలియాస్ కమలేశ్, ఆయన భార్య మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణ ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కమలేశ్, ప్రస్తుతం తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్‌చార్జ్‌గా పనిచేస్తూ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో SZCM హోదాలో ఉన్నారు. చత్తీస్‌గఢ్‌లో పలు ఆపరేషన్లలో వీరు కీలకంగా వ్యవహారించారు. మావోయిస్టు పార్టీ వైఫల్యాలు, కేంద్ర కమిటీ విధానాలపై విసుగు చెంది, ఈ సిద్ధాంతం ఇక చెలామణి అవ్వదని గ్రహించి లొంగిపోయినట్లు మావోయిస్టులు చెప్పారు. కమలేష్‌పై ఆంధ్రప్రదేశ్‌లో రూ.20 లక్షల రివార్డు, అరుణపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) మీడియాతో మాట్లాడారు.


లొంగిపోయిన మావోయిస్టు దంపతులకు తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున చెక్కులను అందచేశామని తెలిపారు. అల్లురి సీతారామరాజు జిల్లాలో ఆపరేషన్ బృందాలు మావోయిస్టుల ఆయుధాలు, డంప్ స్వాధీనం చేసుకుందని చెప్పుకొచ్చారు. వీటిలో మొత్తం 18 ఆయుధాలు ఉన్నాయని.. 1 AK-47, 2 BGLలు, 5 SLRలు, 2 INSAS రైఫిళ్లు, 606 లైవ్ రౌండ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు, ఇతర పరికరాలు ఉన్నాయని వెల్లడించారు. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇటీవల ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని.. పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్‌‌లు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. ఏపీ పోలీసులు ఫీల్డ్ లెవల్లో బాగా పని చేసి మంచి ఫలితాలు చూపించారని చెప్పుకొచ్చారు. వయలెన్స్ పోతేనే ఎక్కడైనా అభివృద్ధి సాధ్యమవుతుందని.. అందుకే వీటి‌పై ప్రధానంగా దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టులకి కూడా నేడు రివార్డులు అందజేస్తున్నామని ప్రకటించారు. మావోయిస్టులు పునరాలోచన చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.


హింసాత్మక ఘటనలతో సాధించేదేమీ లేదని స్పష్టం చేశారు. ఏపీ ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉద్ఘాటించారు. మావోయిస్టులు మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని సూచించారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వస్తే... ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కాలంలో ఐదుసార్లు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ఈ ఆపరేషన్లలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందగా, వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, ఏపీ మావోయిస్టు కమిటీ సభ్యులు అరుణ, జగన్, డివిజనల్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి రమేశ్ ఉన్నారని గుర్తుచేశారు. అలాగే వీరి నుంచి 8 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. UG కేడర్‌లో ఇప్పటివరకు నలభై ఏడుమంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పుకొచ్చారు. విధుల్లో అద్భుత ఫలితాలు సాధించిన పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు. UG కేడర్‌లో పనిచేస్తున్న మావోయిస్టులు అందరూ లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. సరెండర్ పాలసీ ప్రకారం మావోయిస్టుల లొంగుబాటుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సహకరిస్తోందని అన్నారు. మావోయిస్టులపై ఉన్న రివార్డ్‌తో పాటు, ఇంటి స్థలం, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఇరవై మంది ఏపీ వారు ఉన్నారని గుర్తుచేశారు. అందులో అయిదు మంది SZCM హోదాలో ఉన్నట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. మావోయిస్టులు తమకు లొంగిపోకుండా సోషల్‌ ప్రాబ్లమ్ అని‌ ఇంకా చెప్పడమనేది‌ సరి‌కాదని.. ఏపీలో ఎక్కడా ఇప్పుడు మావోయిస్టులు లేరని తెలిపారు. ఏపీ అభివృద్ధిలో మావోయిస్టులు భాగస్వామ్యం కావాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు.


గంజాయి రవాణాను చాలావరకు అరికట్టాం: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

గంజాయిపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి రవాణా చేసే వారిపై క్విట్ ఎన్టీపీఎస్ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. గంజాయి రవాణాను చాలావరకు అరికట్టామని అన్నారు. గంజాయి సాగును పూర్తిగా నివారించి, ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ప్రోత్సాహిస్తున్నామని తెలిపారు. ఈ విధానం వల్ల చాలామంది గంజాయికి దూరంగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేలా పని చేస్తున్నామని వెల్లడించారు. గంజాయి అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆధారాలు లేని ఆరోపణలపై తాము స్పందించమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు

అనుమానాలొద్దు.. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తాం

Read latest AP News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 05:01 PM