AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. రాజధాని అమరావతి భూములపై ప్రత్యేక చర్చ
ABN , Publish Date - Jul 09 , 2025 | 06:53 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రి మండలి భేటీ కానుంది.ఈ సమావేశంలో కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన ఇవాళ(బుధవారం) రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం (Cabinet Meeting) జరుగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. అలాగే పలు బిల్లులకు కూడా ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలపై కేబినెట్ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించనున్నారు. నాలా ఫీజు రద్దు అంశంపైన కేబినెట్‌లో మాట్లాడనున్నారు.
12 అంశాలు అజెండాగా మంత్రి మండలి సమావేశం కానుంది. ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారుల టవర్స్ పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు రూ.525 కోట్లతో మంజూరుకు కేబినెట్ ఆమోదించనుంది. సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు కేటాయించిన భూములపై రివ్యూ చేసి మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఏపీ సీఆర్డీఏ చట్టంలో భాగంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ స్కీంకు ఆమోదం తెలిపి కమిషనర్‌కు అధికారం ఇస్తూ కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నారు. రాజధాని పనుల కోసం రూ.286 కోట్ల ఇసుక డీసెల్టింగ్‌కు ప్రకాశం బ్యారేజ్ ఎగువన అనుమతి ఇస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
నీటి వనరుల అభివృద్ధిలో భాగంగా 71 పనులను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వనుంది. నెల్లూరు జిల్లాలోని లింగసముద్రం మండలంలో రాళ్లపాడు గ్రామంవద్ద రైట్ మెయిన్ కెనాల్ స్లూయిజ్ పనులకు రూ.22.50 లక్షలు చెల్లింపునకు ఆమోదం తెలపనుంది. ఏపీ ఎయిర్‌పోర్టు కార్పొరేషన్ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌కు హడ్కో నుంచి రూ. 1000 కోట్ల రుణానికి అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు ఈ మొత్తాన్ని కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి ఎయిర్ పోర్టులతో పాటు కుప్పం ఎయిర్ పోర్టుకు వయోబులిటి గ్యాప్ ఫండింగ్ కోసం ఉపయోగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రత్యర్థుల దాడిలో మరణించిన చంద్రయ్య కుమారుడు టి. వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం-సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రిసెలెన్స్‌ను అమరావతిలో ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదించనుంది. ఏపీ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్‌ను కంపెనీ యాక్ట్ కింద అటానమస్ బాడీగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. ఈమేరకు పబ్లిక్ సెక్టార్ షెడ్యుల్ బ్యాంకుల నుంచి జల జీవన్ మిషన్ మ్యాచింగ్ గ్రాంట్ కోసం రూ.10 వేల కోట్లు రుణం తీసుకునేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. మోటార్ వెహికల్స్‌కు గ్రీన్ టాక్స్‌ను తగ్గించడానికి ఆమోదించనున్నారు. గతంలో లా క్వార్టర్లీ టాక్స్ విధానంలో కూడా మంత్రి మండలి మార్పులు తీసుకురానుంది. కార్మిక శాఖలో పలు సవరణ బిల్లులకు ఇవాళ మంత్రి మండలిలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(బుధవారం) బిజీబిజీగా ఉండనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 10:45 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. 11:00 గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:00 గంటలకు ఏపీలో ఏర్పాటు చేసే గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాల గురించి సమీక్షించనున్నారు. 4:15 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జగన్ జీవితమంతా ఇక ఓదార్పు యాత్రలే
స్లీపర్ సెల్స్‌పై సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత
For More AP News and Telugu News