Share News

CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ: చంద్రబాబు

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:25 PM

విద్యుత్ సంస్కరణలు దేశంలో తొలిసారి ప్రారంభించింది తానేనని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. సంస్కరణల అమలు తర్వాత తాను అప్పట్లో అధికారం కోల్పోయానని చెప్పుకొచ్చారు. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజ్‌పై దృష్టి సారించామని పేర్కొన్నారు.

CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ: చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి: ఏపీని హైడ్రోజన్ వ్యాలీగా (Hydrogen Valley) మారాలని నిర్ణయించామని.. అందుకు అవసరమైన టెక్నాలజీ మీరు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు (AP CM Chandrababu Naidu) దిశానిర్దేశం చేశారు. మీ ఆలోచనలు వినటానికి, ఆవిష్కరణల గురించి తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చానని చెప్పుకొచ్చారు. రెండు రోజులు పాటు మీరు ఇక్కడ ఉంటారని తెలిపారు. గ్లోబల్ వార్నింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగిందని వ్యాఖ్యానించారు.


ఇవాళ(శుక్రవారం, జులై 18) అమరావతి SRM యూనివర్సిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో వివిధ కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం, ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్‌తో విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాల గురించి సీఎం చర్చించారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, సీఎస్ విజయానంద్, ఇంధన రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు.


దేశంలో విద్యుత్ సంస్కరణలని తొలిసారి ప్రారంభించా..

‘విద్యుత్ సంస్కరణలని దేశంలో తొలిసారి ప్రారంభించింది నేనే. సంస్కరణలు అమలు చేసిన కారణంగా అప్పట్లో అధికారం కోల్పోయాను. ఎనర్జీ తయారీ ఖర్చును ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్నాం. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజ్‌పై దృష్టి సారించాం. విద్యుత్ తయారీ సంస్థలు ఈ విషయంపై పరిశోధనలు చేయాలి. ఏపీ ఇలాంటి పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలి. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. 500 గిగావాట్ల హరిత విద్యుత్ తయారీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా నిర్దేశించారు. నీతి అయోగ్ కూడా దీనిపై దృష్టి సారించింది.  మీ అందరికీ బెస్ట్ ప్లేస్ ఏపీలోనే ఉంది.. కాబట్టి మీరు అందరూ ముందుకు రావాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు.


ఇవి కూడా చదవండి..

నౌకాదళంలోకి స్వదేశీ ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’

ఘోర ప్రమాదం.. లారీని వెనక నుంచి ఢీకొన్న కారు

Read latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2025 | 09:45 PM