Share News

CM Chandrababu: బాహుబలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో శాస్త్రవేత్తలకి సీఎం చంద్రబాబు అభినందనలు

ABN , Publish Date - Nov 02 , 2025 | 09:21 PM

బాహుబలి రాకెట్ LVM3 ప్రావీణ్యం చాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. LVM3-M5 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం, మన దేశానికి గర్వకారణమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

CM Chandrababu: బాహుబలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో శాస్త్రవేత్తలకి సీఎం చంద్రబాబు అభినందనలు
CM Chandrababu

శ్రీహరికోట, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రవేశపెట్టిన బాహుబలి (LVM3-M5) రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఇవాళ(ఆదివారం) నింగిలోకి LVM3-M5 రాకెట్‌ దూసుకెళ్లింది. సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని నింగిలోకి LVM3-M5 రాకెట్‌ మోసుకెళ్లింది. సీఎంఎస్-03 ఉపగ్రహం బరువు 4,410 కిలోలు ఉంది. ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో సీఎంఎస్-03 అతిపెద్దది.


భారత్‌కు సమాచార సేవలు అందించనుంది సీఎంఎస్-03 ఉపగ్రహం. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహం తయారైంది. పదేళ్లపాటు ఇంటర్నెట్‌ సేవలని ఈ ఉపగ్రహం అందించనుంది. ఈ నేపథ్యంలో సీఎంఎస్-03 ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మంత్రి అచ్చెన్నాయుడులు అభినందనలు తెలిపారు.


బాహుబలి రాకెట్ LVM3 ప్రావీణ్యం చాటింది: సీఎం చంద్రబాబు

బాహుబలి రాకెట్ LVM3 ప్రావీణ్యం చాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. LVM3-M5 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం, మన దేశానికి గర్వకారణమని ఉద్ఘాటించారు. ఇప్పటి వరకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టిన అన్ని ప్రయోగాలు విజయవంతమయ్యాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ పెట్టారు.

మన దేశానికి, ఇస్రోకి గర్వకారణం: సీఎం చంద్రబాబు

‘భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-03ను దాని ఉద్దేశించిన కక్ష్యలోకి ఖచ్చితత్వంతో మోసుకెళ్లిన LVM3M5 ‘బాహుబలి’ ప్రయోగం సందర్భంగా ఇస్రో బృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయం అంతరిక్ష సాంకేతికతలో భారతదేశ బలాన్ని, కమ్యూనికేషన్ రంగంలో మంచి మార్పుని తీసుకువస్తుంది. ఇది మన దేశానికి, ఇస్రోకి గర్వకారణం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


విజ్ఞాన శాస్త్రంలో భారత్ ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తోంది: మంత్రి అచ్చెన్నాయుడు

YS Jagan Mohan Reddy

విజ్ఞాన శాస్త్రంలో భారత్ ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగంతో భారత్ కొత్త శకంలోకి దూసుకెళ్లిందని చెప్పుకొచ్చారు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే శాస్త్ర శక్తి మన ఇస్రోదేనని, దేశ గర్వాన్ని మళ్లీ రెట్టింపు చేసిందని తెలిపారు. ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సేవలకు గేమ్‌చేంజర్‌గా సీఎంఎస్-03 ఉండనుందని వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు.


4,410 కిలోల భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిన ఇస్రో ప్రతిభకు సెల్యూట్ అని పేర్కొన్నారు. భారత్‌ను అంతరిక్ష శక్తిగా నిలుపుతున్న శాస్త్రవేత్తలు దేశ రత్నాలని ఉద్ఘాటించారు. ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ భారత ప్రతిభకు బ్రాండ్ అంబాసిడర్, సమాచార విప్లవానికి నూతన అడుగు ఈ ఉపగ్రహమని చెప్పుకొచ్చారు. సముద్ర భద్రత, జలాంతర్గాముల కమ్యూనికేషన్‌లో సీఎంఎస్-03 కీలకమని తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ అగ్రగామి అవుతోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో దారుణం.. మహిళపై ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రమాదం.. అయ్యప్ప స్వాములకి తీవ్రగాయాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2025 | 10:02 PM