Share News

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలివే..

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:32 PM

ఏపీ కేబినెట్‌లో పోలవరం-బనకచర్లపై అంతర్గత చర్చ జరిగింది. వరద జలాలను మాత్రమే ఏపీ వాడుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సముద్రంలోకి వృథాగా పోతున్న 3వేల టీఎంసీలను మాత్రమే ఏపీ వాడుకుంటుందని తెలిపారు. వరద జలాలను తెలంగాణ కూడా వాడుకోవచ్చని తమకు అభ్యంతరం లేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు.

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలివే..
AP Cabinet

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ఇవాళ(మంగళవారం) ఏపీ సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రి మండలితో చర్చించారు. పలు అంశాలపై చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలపింది. మున్సిపల్ శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని రెండో విడత భూసేకరణను ఆమోదించింది. రాజధానిలో మరో 44వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర P4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పింది. టెన్నిస్ ప్లేయర్ సాకేత్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం బనకచర్లపై తెలంగాణ నేతలు అందరూ మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నిన్న(సోమవారం) తెలంగాణ కేబినెట్‌లో బనకచర్లపై వాళ్లు డిస్కస్ చేశారని అన్నారు. ఏపీ కూడా మన వాదనలు వినిపించాలని సూచించారు సీఎం చంద్రబాబు.


తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్ట్‌లు..

తెలంగాణ వాళ్లు అనుమతి లేని ప్రాజెక్ట్‌లను కూడా కడుతున్నారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఇంకా చాలా ప్రాజెక్ట్‌లను వాళ్లు కడుతున్నారని తెలిపారు. తెలంగాణ వాడుకోగా మిగిలిన నీళ్లను మాత్రమే కదా ఏపీ వాడుకునేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ నేతలు బనకచర్లపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వరద జలాలను మనం వాడుకుంటామని.. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూటమి నేతలు చెప్పాలని ఆదేశించారు. పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్‌పై మనం దశల వారిగా ముందుకు వెళ్తామని సూచించారు. ఆ తర్వాత కేంద్రప్రభుత్వం ఏం చెబుతుందో దాని ఆధారంగా మనం నిర్ణయం తీసుకుందామని వివరించారు. ఈ ప్రాజెక్ట్‌లు ఎప్పుడూ శంకుస్థాపన చేస్తామనేది త్వరగా నిర్ణయించాలని మంత్రి లోకేష్ అన్నారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌కి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ జోక్యం కూడా అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ విషయం అర్ధమయ్యేలా చెప్పేందుకు అవసరమైతే కేంద్రం ద్వారా ఓ సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పారు. సున్నితమైన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌పై నేతలు పూర్తి అవగాహనతో జాగ్రత్తగా మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.


రెవెన్యూ సమస్యల పరిష్కారం...

రెవెన్యూ సమస్యలను ఏడాదిలోపు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. అన్నక్యాంటీన్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అన్న క్యాంటీన్లను మానిటర్ చేయడానికి, ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకోవడానికి ఒక కమిటీని వేయాలని చంద్రబాబు సూచించారు. అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్‌కు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసే విధంగా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో కొన్ని పంటలకు డిమాండ్ లేకపోవడంతో మనం మార్కెట్‌లోనే కొంటున్నామని స్పష్టం చేశారు. పొగాకుకు మార్కెట్‌లో ధర తక్కువగా ఉండటంతో రూ. 250 కోట్లు కేటాయించామని అన్నారు. పొగాకును మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.


మంత్రులకు కీలక సూచనలు..

ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకు, మామిడి, కోకో పంటల రైతులను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తేమ శాతం ఎక్కువ ఉందనే కారణంతో పోగాకుకు మార్కెట్‌లో డిమాండ్ తక్కువ ఉన్నా మనం చొరవ తీసుకుని రైతులను ఆదుకుంటున్నామని అన్నారు. చేసిన మంచిని చెప్పుకోవటంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని వివరిస్తూనే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతును ప్రోత్సహించాలని సూచించారు. డిమాండ్‌కు తగ్గట్లుగా వాణిజ్య పంటలు వేసేలా రైతులను చైతన్య పరచాలని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకును ఇంత పెద్దమొత్తంలో కొనుగోలు చేయటం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. వాణిజ్య పంటలని కొనుగోలు చేసింది కూడా ఏపీనేనని గుర్తుచేశారు. ప్రజలకు ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పుకోలేక పోతున్నామని నేతలను అడిగారు. అమరావతిలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వ పరంగా కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 6497 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తామని అన్నారు. టెంపుల్ టూరిజంతో పాటు ఏపీలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ సక్సెస్‌పై నేతలను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఈ తరహా కార్యక్రమాలు పెద్డఎత్తున నిర్వహిస్తూ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.


ఏడాది పాలనను వివరించాలి..

సీఆర్డీఏ పరిధిలో కొత్తగా తీసుకునే భూముల్లో ప్రభుత్వానికి సంబంధించి... 2019కు ముందు ఆరేళ్ల అనుభవ దారు ఎవరు ఉంటారో వారికే నష్టపరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. జిల్లా స్థాయిలో ఏడాది పాలనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సమావేశం పెట్టాలని కోరారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఏడాది పాలనపై సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ నెలాఖరులోపు ఈ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జులై 1వ తేదీ నుంచి ఏడాది పాలనపై ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి వివరించాలని నిర్దేశించారు సీఎం చంద్రబాబు. కూటమిలోని అన్ని పార్టీల నేతలను కలుపుకొని ముందుకు వెళ్లాలని కోరారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్లు రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి సంబంధిత భూమి వాళ్లకు లీజ్‌కు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. బిల్డింగ్ రూల్స్‌ను మరింత సరళతరం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గుజరాత్‌లో మాదిరిగా బిల్డింగ్ రూల్స్‌ను సరళతరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాజధాని అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకి వెంటనే ప్లాన్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు

ఆ ట్వీట్‌కు లోకేష్ క్విక్ రియాక్షన్.. వారికి సీరియస్ వార్నింగ్

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా.. జగన్‌పై షర్మిల ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 04:29 PM