AP GOVT: టమాటా రైతులకు రిలీఫ్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Feb 20 , 2025 | 09:55 PM
AP GOVT: టమాటా రేట్ల పతనంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. టమాటా రేటు భారీగా పతనమైన పరిస్థితిలో రైతులకు ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టమాట రైతులకు కొంతమేర ఊరట కలగనుంది.

అమరావతి: టమాటా ధరల పతనంపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల దగ్గర రేపటి నుంచి టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో టమాటాను రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇవాళ(గురువారం) సాయంత్రం మంత్రి అచ్చెన్నాయుడు మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత, సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ALSO READ: CM Chandrababu: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు
తక్షణ చర్యలు చేపట్టాలి..
రాష్ట్రంలో టమాటా ధరల పతనంపై ప్రభుత్వం తక్షణ చర్యలకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెటింగ్ శాఖ రైతుల నుంచి రేపటి నుంచి (21.02.25)టమాట కొనుగోలు చేసి ఏపీ వ్యాప్తంగా రైతు బజార్లులో నేరుగా విక్రయించాలని, పొరుగు రాష్ట్రాలకు అవసరం మేరకు ఎగుమతి చేసేందుకు చర్యలు చేపట్టామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు..
కేంద్ర ప్రభుత్వంలో పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే రవాణా సబ్సిడీ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఆయా జిల్లాల మార్కెటింగ్ అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్లు, రైతు బజార్ల అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో ప్రత్యేకంగా కృషి చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగు దశ నుంచి మార్కెటింగ్ దశ వరకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మాటిచ్చారు. టమాటా కొనుగోళ్లకు అధికారులు తక్షణమే చర్యలు ప్రారంభించాలని, పరిస్థితి తనకు నేరుగా ఎప్పటికప్పుడు తెలియచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
టమాట ధర పతనం.. రైతుల ఆవేదన..
కాగా, టమాటా ధర భారీగా తగ్గింది. కిలో రూ.5 లోపే పలుకుతోంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఏపీలో పలు జిల్లాల్లో టామాటా అధికంగా సాగు చేసే రైతుల పరిస్థితి వర్ణనాతీతం. ప్రస్తుతం పలు చోట్ల కొందరు ట్రేలతో వాటిని విక్రయిస్తున్నారు. 25 నుంచి 30 కేజీల టామాటాను వంద రుపాయలకు విక్రయిస్తున్నా.. ఎవరూ కొనడం లేదని రైతులు వాపోతున్నారు. మొత్తంగా ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన టామాటాను పొలాల్లో వదిలేయలేక.. గిట్టుబాటు ధర పొందలేక అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు.
ఈ వార్తలు కూాడా చదవండి
Minister Anitha: ఆ అధికారులపై హోంమంత్రి అనిత ప్రశంసలు
YS Sharmila: ఐదేళ్లు దోచుకున్నారు.. బొత్సపై షర్మిల ఫైర్
Vamshi Case: వంశీ కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. కోర్టు ఏం చెప్పిందంటే
Read Latest AP News And Telugu News