CM Chandrababu: జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:31 PM
జఠిలమైన వ్యవసాయ సమస్య పరిష్కరించడానికి ఐదు సూత్రాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. ఇందులో భాగంగానే నీటి భద్రత కల్పించాలని భావించామని పేర్కొన్నారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వ్యవసాయం అస్తవ్యస్థం అయ్యిందని విమర్శలు చేశారు. ఇవాళ(బుధవారం) తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ప్రసంగించారు సీఎం చంద్రబాబు.
వైసీపీ హయాంలో భూములు కబ్జా చేయడానికి 22ఏ విధానం..
వైసీపీ హయాంలో భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. ఇష్టం ఉంటే భూరికార్డులు అలాగే ఉంచారని.. భూములు కబ్జా చేయాలనుకుంటే 22ఏ విధానం అనుసరించారని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించారని విమర్శించారు. గత జగన్ ప్రభుత్వం పశువులకు దాణా కూడా ఇవ్వలేదు. వైసీపీ అక్రమాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పవన్ కల్యాణ్‌లతో కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లామని గుర్తుచేశారు. చర్రితలో ఎప్పుడు లేనంతగా రికార్డు సీట్లను తమకు ప్రజలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. 90 శాతం సీట్లను తమకు ప్రజలు ఇచ్చారని గుర్తుచేశారు. మొదటగా రైతుల సమస్యలు పరిష్కరించాలని అనుకున్నామని దాని తర్వాత మిగతా సమస్యలపై దృష్టి సారించామని తెలిపారు. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
వ్యవసాయం ద్వారా ఆరు శాతం ఆదాయం..
‘వ్యవసాయం ద్వారా రాష్ట్రానికి ఆరు శాతం ఆదాయం వస్తుంది. వ్యవసాయంలో ఖర్చులెక్కువ ఆదాయం తక్కువ. వ్యవసాయమే మన బలం.. ఈరంగంలో అనేక సమస్యలు వస్తున్నాయి. వ్యవసాయంలో జూదం వద్దు. సమస్యలు అన్ని ఒకేసారి పరిష్కారం అయిపోతాయని భావించి ముందుకు వెళ్తే, నష్టపోయే పరిస్థితి వస్తుంది. రైతుల్లో కూడా మార్పు రావాలి. మేము రూపాయి ఇస్తే, మీరు రుపాయి ఖర్చుపెట్టాలి. చదువుకునే పిల్లలు కూడా వ్యవసాయం అంటే పొలాల నుంచే నేర్చుకోవాలి. ప్రస్తుతం వ్యవసాయ పనులు చేయడానికి ప్రజలు ముందుకు రావడం లేదు.. అందుకే యాంత్రికరణ జరగాలి. మీరు పండించే పంట విలువ ఇక్కడ పరిస్థితిపై ఆధారపడి ఉండదు. ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల్లో జరిగే పరిణామాలపై ఆధారపడి ఉంటాయి. రైతులకు గిట్టుబాటు ధర రావాలి.. ఆదాయం పెరగాలి. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల వాసులతో పాటు రాయలసీమ వాసులకు డయాబెటిస్ వస్తోంది. రాష్ట్రాన్ని ఒక మోడల్ స్టేట్‌గా మారుస్తాం. విశాఖపట్నం సమ్మిట్‌లో ఎప్పుడూ రానంత పెట్టుబడులు వచ్చాయి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు..
నదులను అనుసంధానం చేస్తాం..
‘జఠిలమైన వ్యవసాయ సమస్య పరిష్కరించడానికి ఐదు సూత్రాలు అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగానే నీటి భద్రత కల్పించాలని భావించాం. గంగా, కావేరి నదులను అనుసంధానం చేయాలని అప్పుడే నిర్ణయించాం. ఇప్పట్లో సాధ్యం కాదని, కనీసం మన రాష్ట్రంలో నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించాం. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ఎట్టి పరిస్థితుల్లోనైనా తరలిస్తాం. భూమిని జలాశయంగా చేసి, భూగర్భ జలాలు పెంచితే నీటి సమస్య ఉండదు. నేను చాలా సమస్యలు పరిష్కరించగలను. రైతుల సమస్యలు పరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది. గతంలో రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేశారు. కరెంటు చార్జీలను పెంచబోం. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తున్నాం. పెన్నా నది వరకు తీసుకువెళ్తాం. ప్రతీ ఎకరానికి నీరు అందేలా చేస్తాం. ఏపీలో తాగడానికి, వ్యవసాయానికి, పారిశ్రామికరంగానికి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల
Read Latest AP News and National News