Education Dept : కార్పొరేట్ ‘టాలెంట్’ టెస్ట్‌లు
ABN , Publish Date - Mar 03 , 2025 | 03:59 AM
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కార్పొరేట్ మేనేజ్‌మెంట్లు టాలెంట్ టెస్ట్‌లు నిర్వహించాయి. వీటిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు టెస్టులను అడ్డుకున్నారు.

కొన్ని పాఠశాలల్లో ఇష్టారాజ్యం.. టాలెంట్ టెస్ట్‌లపై రాష్ట్రంలో నిషేధం
నిబంధనలు తుంగలో తొక్కి నిర్వహణ
అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అడ్మిషన్ల కోసం విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆకర్షించకూడదంటూ.. అమల్లోకి తెచ్చిన నిబంధనలను తుంగలో తొక్కి ‘టాలెంట్’ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కార్పొరేట్ మేనేజ్‌మెంట్లు టాలెంట్ టెస్ట్‌లు నిర్వహించాయి. వీటిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు టెస్టులను అడ్డుకున్నారు. కానీ, అనేక చోట్ల అధికారులకు సమాచారం చేరేలోగా టెస్ట్‌ల నిర్వహణ పూర్తిచేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం టాలెంట్ టెస్ట్‌ల పేరుతో కార్పొరేట్ మేనేజ్‌మెంట్లు ఈ విధంగా అడ్డదారులు తొక్కుతున్నాయి. అడ్మిషన్ల కోసం టాలెంట్ టెస్ట్‌లు నిర్వహించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఉమ్మడి రాష్ట్రంలో 1994లో వాటిని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచీ పలు మార్పులతో ఆ నిషేధం కొనసాగుతోంది. టాలెంట్ టెస్ట్‌లకు అనుమతివ్వాలని 2011లో ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించగా కోర్టు కూడా నిషేధం కొనసాగించాలని స్పష్టం చేసింది. కానీ మధ్యలో కొన్ని ప్రైవేటు మేనేజ్‌మెంట్లు అనధికారికంగా టాలెంట్ టెస్ట్‌లు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. విద్యాశాఖ వర్గాలు మాత్రం దీనిపై గట్టి చర్యలు తీసుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది.
ఇంటింటికీ వెళ్లి ఆహ్వానం
అనధికారికంగా నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్‌లకు ప్రచారం చేస్తే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ఆయా మేనేజ్‌మెంట్లు ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. టెస్ట్‌లు నిర్వహించే ప్రాంతాల్లో పాఠశాలల టీచర్లు, సిబ్బందిని ఇంటింటికీ పంపి టాలెంట్ టెస్ట్‌లకు వచ్చేలా ప్రలోభపెడుతున్నారు. టెస్ట్‌ల నిర్వహణలోనూ మ్యాజిక్‌లు ప్రదర్శిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేసి, ఫీజులో డిస్కౌంట్ ఇస్తామని అక్కడే ప్రలోభాలకు దిగుతున్నారు. టెస్ట్‌లో అంతంతమాత్రంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా ఎంతో కొంత ఫీజులు తగ్గిస్తామని, తమ స్కూల్లో చేరితే అద్భుతంగా తీర్చిదిద్దుతామని నమ్మబలుకుతున్నారు. ఈ మార్కులు, ఫీజుల రాయితీలు చూసి కొందరు తల్లిదండ్రులు ఆకర్షితులై అడ్మిషన్లు తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అలాగే చిన్నపాటి ప్రైవేటు పాఠశాలల అవకాశాలు కూడా దెబ్బతింటున్నాయి.