Minister Satyakumar: పెట్టుబడులపై జగన్ అండ్ కోవి అసత్య ప్రచారం.. మంత్రి సత్యకుమార్ ధ్వజం
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:57 PM
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ రావాలని... వారి పార్టీ నేతలు లాగా తాము అవహేళనగా మాట్లాడమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రప్పా రప్పా భాష మాట్లాడమని చెప్పుకొచ్చారు. జగన్ నిర్భయంగా అసెంబ్లీకి రావాలని అక్కడ నిజాలు చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.

తిరుపతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో వచ్చిన పెట్టుబడులపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులపైన సాక్షి ఛానల్‌లోనే చర్చ పెడితే చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఇవాళ(ఆదివారం) తిరుపతిలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో రూ.2.5లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ప్రైవేట్ పరంగా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఇలా పెట్టుబడులు పెడుతున్న సంస్థలకు తాము మళ్లీ ఏపీలో అధికారంలోకి వచ్చేస్తామని జగన్ అండ్ కో మెయిల్స్ చేయటం రాష్ట్రాన్ని దెబ్బతీయటానికి కాదా? అని ప్రశ్నించారు. ఏపీ మద్యం స్కాంలో ఎప్పుడు చూసినా జగన్ పక్కనే ఉన్న నేతలకు సంబంధించిన కోట్ల రూపాయలు బయటపడుతున్నాయని విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన స్కాముల్లో ఆ పార్టీ నేతలు, అనుచరులు దొరికినప్పుడు సంబంధం లేదని అంటున్నారని... కోర్టుల్లో ఏడ్చి, బయటకు వచ్చిన తర్వాత అరుస్తున్నారని.. అద్భుతంగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
జగన్ కూడా జైలుకు వెళ్లాల్సి వస్తోందని తెలిసే... సానుభూతి పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. సొంత ఎంపీనే పోలీసులతో కొట్టించి, వీడియో కాల్‌లో చూసి జగన్ పైశాచిక ఆనందం పొందారని ధ్వజమెత్తారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ రావాలని... వారి పార్టీ నేతలు లాగా తాము అవహేళనగా మాట్లాడమని తెలిపారు. రప్పా రప్పా భాష మాట్లాడమని చెప్పుకొచ్చారు. జగన్ నిర్భయంగా అసెంబ్లీకి రావాలని.. అక్కడ నిజాలు చెప్పాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, కూటమి ప్రభుత్వంలో ఇస్తున్న వాటిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్
ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్
For More AP News and Telugu News