Tirumala: టీటీడీ ఆలయాల్లో ఆణివార ఆస్థానం
ABN , Publish Date - Jul 15 , 2025 | 09:02 AM
గోవిందరాజస్వామి, కోదండరామాలయాల్లో జులై 16న ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది.

తిరుపతి: గోవిందరాజస్వామి, కోదండరామాలయాల్లో రేపు (బుధవారం, జులై 16)న ఆణివార ఆస్థానం (Aani Vaar Asthanam) నిర్వహించనున్నారు. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. గోవిందరాజస్వామి ఆలయంలో బంగారువాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత గోవిందుడిని వేదిక పైకి తీసుకువచ్చిన తర్వాత ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుంచి నూతన వస్త్రాలను విమాన ప్రదక్షిణగా స్వామివారికి సమర్పిస్తారు. కోదండరామాలయంలో గరుడాళ్వార్ అభిముఖంగా సీతాలక్ష్మణ సమేత రాములవారిని తీసుకువచ్చి ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం నూతన వస్త్రాలను మూలవరులకు, ఉత్సవ వరులకు అలంకరిస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో 17న ఆణివార ఆస్థానం
అలాగే.. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తేదీన ఆణివార ఆస్థానం జరగనుంది. ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చింది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజైన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ బోర్డు ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్‌ను మార్చి - ఏప్రిల్ నెలలకు మార్చారు. కాగా.. 17వ తేదీ సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పుష్పపల్లకిలో కొలువు దీరి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆణివార ఆస్థానం సందర్భంగా 17న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
ర్యాంకర్లను సన్మానించిన మంత్రి లోకేశ్
ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు గవర్నర్లు
Read Latest AP News And Telugu News