CM Chandrababu: ఘనంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 01 , 2025 | 06:29 PM
సత్యసాయి శతజయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.
సత్యసాయి జిల్లా, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): సత్యసాయి శతజయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాకు సత్యసాయి బాబా నీటి సరఫరా విషయంలో తన దగ్గర మాట తీసుకున్నారని గుర్తుచేశారు. ఎల్ అండ్ టీ ద్వారా తాను గతంలో ఆ పనులు చేయించానని... కానీ ఆ తర్వాత వచ్చిన పాలకులు ఆ పనులని ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు.
సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ఈనెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ వైభవంగా నిర్వహించేందుకు తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని ప్రకటించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్‌తో ఓ కమిటీ వేశామని తెలిపారు. సత్యసాయి ట్రస్టుతో కలిసి మంత్రుల కమిటీ శతజయంతి ఉత్సవాలను పర్యవేక్షిస్తుందని చెప్పుకొచ్చారు. ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తిని అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. అభివృద్ధి అజెండాతో పనిచేస్తున్న బీజేపీ.. గుజరాత్ రాష్ట్రంలో గడచిన 25 ఏళ్లుగా అధికారంలో ఉందని నొక్కిచెప్పారు సీఎం చంద్రబాబు.
ఏపీలో ఏ వ్యక్తి తప్పు చేసినా ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడితే వారికి అదే చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ(శనివారం) సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పేదలసేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో నిన్ననే కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ కేసులో ఐదుగురికి ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని తెలిపారు సీఎం చంద్రబాబు.
న్యాయం జరగడానికి ఆలస్యం అయినా.. తప్పు చేసిన వారు తప్పించుకోలేరనడానికి ఈ తీర్పు అతిపెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. అతి దారుణంగా మేయర్ కార్యాలయంలోనే ఆ దంపతుల్ని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో తాము అభివృద్ధి చేసిన వాటిని గత పాలకులు విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ వచ్చి వాటినే మొదలుపెట్టాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చేసిన పనులని విధ్వంసం చేస్తే.. మళ్లీ వాటినే పునరుద్ధరించటం చాలా కష్టతరం అవుతుందని వెల్లడించారు. ప్రజలంతా ఆలోచించి తమ ప్రభుత్వానికి సహకరిస్తేనే శాశ్వతంగా మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
నేను అభివృద్ధి చేస్తుంటే.. వాళ్లు విధ్వంసం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News