Share News

CM Chandrababu ON Pension: మా ప్రభుత్వంలోనే మెరుగ్గా పెన్షన్ల పంపిణీ: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 01 , 2025 | 06:11 PM

సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. అభివృద్ధి చేసి ఆదాయం వస్తేనే సంక్షేమం చేయగలమని నొక్కి చెప్పారు.

CM Chandrababu ON Pension: మా ప్రభుత్వంలోనే మెరుగ్గా పెన్షన్ల పంపిణీ: సీఎం చంద్రబాబు
CM Chandrababu ON Pension

సత్యసాయి జిల్లా, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీ మెరుగ్గా చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఉద్ఘాటించారు. ఒక్క పెన్షన్ ఇవ్వడానికే 2.65 లక్షల మంది వలంటీర్లను గత ప్రభుత్వంలో పెట్టారని విమర్శించారు. దానికంటే మెరుగ్గా ఇప్పుడు మూడు గంటల్లోనే పెన్షన్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం పెద్దపీట వేయటంతోపాటు సుపరిపాలన ద్వారా ఏపీని పునర్నిర్మాణం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటుతో కూటమిని గెలిపించి అధికారం అప్పగించారని ఉద్ఘాటించారు. అందుకే నిత్యం ప్రజల గురించే తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.


ఇవాళ (శనివారం) సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. అభివృద్ధి చేసి ఆదాయం వస్తేనే సంక్షేమం చేయగలమని నొక్కి చెప్పారు. ప్రతి నెలా ప్రజలందరినీ కలిసేందుకు తాను వస్తున్నానని చెప్పుకొచ్చారు. గత పాలకుల మాదిరిగా బటన్ నొక్కొచ్చని, పరదాలు కట్టుకుని రావచ్చని, ఇంట్లోనే కూర్చొవచ్చని విమర్శించారు. తాను ప్రజల మనిషినని.. అందుకే మీ దగ్గరకే వచ్చి పెన్షన్ ఇస్తున్నానని స్పష్టం చేశారు. గత పాలకులు హెలికాప్టర్‌లో వచ్చినా కింద చెట్లు నరికేసిన పరిస్థితి ఉండేదని ఎద్దేవా చేశారు. అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకి తేడా అదేనని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.


మొంథా తుఫానుపై ముందస్తుగా హెచ్చరికలు..

‘మొంథా తుఫాను వచ్చి ఏపీలో విధ్వంసం సృష్టించింది. టెక్నాలజీ సాయంతో ముందస్తుగా హెచ్చరికలు ఇచ్చాం. తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. తుఫాను వల్ల రూ.5,244 కోట్ల ఆస్తి నష్టం రాష్ట్రంలో జరిగింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా సమర్థంగా పనిచేసి మీకు సేవలు అందించారు. ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకంతోనే గూగుల్ సంస్థ విశాఖపట్నంలో రూ.1.33 లక్షల కోట్లతో డేటా సెంటర్ పెడుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంపై విశ్వాసంతోనే కియా పరిశ్రమ కూడా అనంతపురం జిల్లాకు వచ్చింది. ప్రజల డబ్బులు వృథా కాకుండా, పేదలకు సంక్షేమం అందించేలా సుపరిపాలన అందిస్తున్నాం. నేను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌లు ఆర్టీజీఎస్ ద్వారా క్షేత్రస్థాయికి ఎప్పటికప్పుడు తుఫానుపై ఆదేశాలిచ్చాం. తుఫాను వల్ల రూ.5,244 కోట్ల మేర నష్టం జరిగింది. ఈ మేరకు తుఫాను నష్టంపై సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం వాయిదా వేయబోం. పెన్షన్ల కోసం ఏడాదికి రూ.33 వేల కోట్ల ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం ఏపీనే. పెన్షన్ల కోసం రూ.50,764 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేశాం. దేశంలోనే ఇదో రికార్డు. అతిపెద్ద డీబీటీ కార్యక్రమం ఇది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

నేను అభివృద్ధి చేస్తుంటే.. వాళ్లు విధ్వంసం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 01 , 2025 | 07:54 PM