Share News

విశ్వ ప్రేమికుడి వేడుక

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:50 AM

పుట్టపర్తి/టౌన/రూరల్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో వైభవంగా సాగుతున్నాయి. హిల్‌వ్యూ స్టేడియంతో బుధవారం నిర్వహించిన వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌, కేంద్ర మంత్రులు భూపతి రాజు...

విశ్వ ప్రేమికుడి వేడుక

పర్తికి తరలివచ్చిన భక్తజనం

హిల్‌ వ్యూ స్టేడియంలో సందడి

- సత్యసాయి సేవలను కొనియాడిన ప్రధాని మోదీ

- సత్యసాయి స్మారక నాణేలు, తపాలా బిల్లల ఆవిష్కరణ

- ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని

- సెంట్రల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రైతులకు గిర్‌ గోవుల బహూకరణ

- సత్యసాయితో బంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు

విశ్వప్రేమకు ప్రతిరూపం భగవాన సత్యసాయిబాబా. సమాజం, ప్రజలను ఆదుకోవడానికి సత్యసాయి నిరంతరం తపించారు. సేవే పరమ ధర్మమని బాబా చేసిన బోధనలే లక్షల మందికి మార్గం చూపాయి. లవ్‌ ఆల్‌... సర్వ్‌ ఆల్‌ అని బాబా బోధించారు. ఆయనతో పాటు ఆయన సంస్థలూ అదే పాటిస్తూ వస్తున్నాయి. మానవ సేవే మాధవ సేవ అని భావించి, ప్రపంచ వ్యాప్తంగా సేవ చేస్తున్నాయి. ఎక్కడ ప్రకృతి వైపరీత్యం వచ్చినా సత్యసాయి సేవాదళ్‌ వాలిపోతోంది. తాగునీరు, వైద్యం, విద్య, విపత్తు నిర్వహణ వంటి బాబా సేవలు అనిర్వచనీయం. భగవాన సత్యసాయి శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడం ఓ వరం. శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం.

-ప్రధాని నరేంద్ర మోదీ

ఈ భూమిపై మనం చూసిన దైవ స్వరూపం భగవాన సత్యసాయిబాబా. ప్రేమ, సేవ, ప్రశాంతతకు ఆయన ప్రతిరూపం. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. ఆయన నడిచిన ఈ పుణ్యభూమిలో శతజయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రేమ ఒక్కటే మతం... హృదయం ఒక్కటే భాష.. మానవత్వమే కులం... అన్ని చోట్లా దైవం ఉన్నారని ఆయన బోధించారు. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మికత వైపు నడిపించిన గొప్ప వ్యక్తి బాబా. బాబాతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ట్రస్ట్‌ కార్యక్రమాలపై పలుమార్లు నాతో చర్చించారు. ఆయన సేవలే స్ఫూర్తిగా మానవాళికి అందరూ ఉపయోగపడాలి.’’

- సీఎం చంద్రబాబు నాయుడు

పుట్టపర్తి/టౌన/రూరల్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో వైభవంగా సాగుతున్నాయి. హిల్‌వ్యూ స్టేడియంతో బుధవారం నిర్వహించిన వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌, కేంద్ర మంత్రులు భూపతి రాజు శ్రీనివాస్‌ వర్మ, కిషన రెడ్డి, రామ్మోహన నాయుడు, రాష్ట్ర మంత్రులు, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన సచిన టెండూల్కర్‌, బాలీవుడ్‌ నటి

ఐశ్వర్యరాయ్‌ బచ్చన, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన మాధవ్‌ తదితరులు హాజరయ్యారు. దేశవిదేశాలకు చెందిన సేవ, రాజకీయ, క్రీడా, సినీ రంగాల ప్రముఖులు వేడుకలలో పాల్గొన్నారు. సత్యసాయి విమానాశ్రయం నుంచి పుట్టపర్తికి, ప్రశాంతి నిలయంలో నుంచి హిల్‌ వ్యూ స్టేడియానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ వెళుతుండగా భక్తులు, ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి అభివాదం చేశారు. సాయిరాం.. సాయిరం అని నినాదాలు చేశారు. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంతు మందిరంలో సత్యసాయి మహాసమాధి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌ తదితరులు సందర్శించి పుప్పాంజలి ఘటించారు. సత్యసాయి సువర్ణ విగ్రహం ఎదుట కాసేపు కూర్చుని ప్రధాని ధ్యానం చేశారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. అనంతరం వందమంది రైతులకు గిర్‌ ఆవులను ప్రధాని పంపిణీ చేశారు. గోవులకు గడ్డి తినిపించారు.

అన్ని దారులూ అటు వైపే..

సత్యసాయి శత జయంతి వేడుకలలో పాల్గొనేందుకు దేశ విదేశీ భక్తులు, ఉమ్మడి జిల్లా, స్థానిక భక్తులు, సామాన్యులు తరలివచ్చారు. హిల్‌ వ్యూ స్టేడియంలో జరిగే ఉత్సవాలకు బుధవారం తెల్లవారు జాము నుంచే క్యూ కట్టారు. పట్టణంలోని అన్ని దారులు స్టేడియంవైపై అన్నట్లు భక్తులు తరలివెళ్లారు. కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఎస్పీ సతీష్‌ కుమార్‌ పట్టణంలో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

వేదికపై ప్రముఖులు

హిల్‌ వ్యూ స్టేడియంలోని ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, సచిన, ఐశ్వర్యా రాయ్‌ బచ్చన, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆశీనులయ్యారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, సచిన మాట్లాడుకుంటూ కనిపించారు. అందరూ కలిసి సత్యసాయి స్మారక నాణేలను, తపాలా బిల్లలను ఆవిష్కరించారు. సత్యసాయి సేవలను, ఆయనతో తమకున్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 30 లక్షల మందికి సత్యసాయి తాగునీరు అందించడం, ఒడీసాలో వరద బాధితులకు ఇళ్ల నిర్మాణం, ఉచిత విద్య, వైద్య సేవలను తమ ప్రసంగాల్లో ప్రస్తావించారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

హిల్‌వ్యూ స్టేడియంలో సత్యసాయిబాబా జీవిత చరిత్ర, మహిమలు, అధ్మాత్మిక, విద్య, వైద్య సేవలకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను డిజిటల్‌ స్ర్కీన్సపై ప్రదర్శించారు. సంగీత దర్శకుడు శివమణి డ్రమ్స్‌, గాయకులు సుధ, రఘునాథన బృందం సంగీత కచేరి భక్తులను అలరించాయి. వసంతలక్ష్మి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన, శ్రీమతి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల విద్యార్థుల, సత్యసాయి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గుజరాతీ నృత్యం, వర్ద డ్యాన్సతో సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:50 AM