Share News

Coalition Government : చెప్పి చూద్దాం.. చేసి చూపిద్దాం

ABN , Publish Date - Dec 30 , 2024 | 03:25 AM

రాష్ట్రంలో గత సర్కారు కొనసాగించిన మానసిక, భౌతికదాడులకు చరమగీతం పాడాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై చెయ్యి వేయడానికి భయపడే పరిస్థితిని తీసుకురావాలని భావిస్తోంది.

Coalition Government : చెప్పి చూద్దాం.. చేసి చూపిద్దాం

  • జనాల్లో ధైర్యం, ఉద్యోగుల్లో స్థైర్యం నింపుదాం

  • సోషల్‌ మీడియాను సన్మార్గంలోకి తెచ్చే యత్నం

  • నాడంతా వైసీపీ మూకలు, సోషల్‌ సైకోల వీరంగం

  • ఉద్యోగులపై దూషణలు.. పోలీసులతో దాడులు

  • నేతలు, మహిళలపై అసభ్య పోస్టులతో వేధింపులు

  • ఆ ఐదేళ్లూ భీతిల్లిన రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు

  • తిరిగి గాడిలో పెట్టే దిశగా కూటమి చర్యలు

  • గట్టు దాటిన వారిని ఉపేక్షించబోమన్న సంకేతాలు

  • డిప్యూటీ సీఎం తక్షణ పరామర్శతో తొలి అడుగు

  • నేడు ఉద్యోగులతో పవన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో గత సర్కారు కొనసాగించిన మానసిక, భౌతికదాడులకు చరమగీతం పాడాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై చెయ్యి వేయడానికి భయపడే పరిస్థితిని తీసుకురావాలని భావిస్తోంది. ఒకవైపు సోషల్‌ మీడియా సైకోలకు చెక్‌ పెట్టే చర్యలు క్షేత్రస్థాయిలోనే మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఎక్కడికక్కడ దీనిపై అవగాహన కోసం భారీ హోర్డింగులు, బ్యానర్లు పెడుతున్నారు. మరోవైపు వైసీపీ మూక దాడుల నుంచి ప్రజలకు, ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులోభాగంగానే గాలివీడు మండలం ఎంపీడీఓ జవహర్‌బాబుపై వైసీపీ నేత జరిపిన దాడిపై ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తక్షణం స్పందించారు. తిరుపతి రిమ్స్‌ ఆస్పత్రికి స్వయంగా వెళ్లి ఎంపీడీవోను ఆయన పరామర్శించారు. ఘటన జరిగిన వెంటనే పవన్‌ కదిలి రావడం ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం కలిగించింది. ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణగా ఉన్నదన్న భరోసా ఏర్పడింది. పవన్‌ పరామర్శతో ఉద్యోగులపై దాడులకు పాల్పడితే ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంటుందన్న సంకేతాలు వెళ్లాయి. నిజానికి, జగన్‌ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడులపై అప్పటి ముఖ్యమంత్రి గానీ, మంత్రులుగానీ అంతగా స్పందించిన పరిస్థితుల్లేవు. పైగా డాక్టర్‌ సుధాకర్‌ లాంటి వారిపై విచక్షణారహితంగా పోలీసులే దాడులు చేసేలా పురిగొల్పారు.


వైసీపీ పాలించిన ఐదేళ్లూ రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగుల్లోనూ అభద్రతా భావం రాజ్యమేలింది. అప్పట్లో వైసీపీ నేతల దెబ్బకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు విలవిలలాడిపోయేవారు. రూల్స్‌ అమలు చేయాలనుకునే ఉద్యోగులకు ఆ ప్రభుత్వ పాలనలో అడుగడుగునా చిక్కులే. ఎప్పుడెప్పుడు జగన్‌ నిరంకుశ పాలన పోతుందా అని ఉద్యోగులు ఎదురుచూశారు. తదనుగుణంగానే కూట మి ప్రభుత్వం చర్యలు ఉండటం, ఉద్యోగులపై దాడిని తీవ్రంగా తీసుకోవడం పట్ల ఉద్యోగ వర్గాలు ఊరట చెందాయి.


పాజిటివ్‌ పోస్టులపై ప్రచారం..

సోషల్‌ మీడియాలో అభ్యంతరకర, అసభ్య పోస్టులు పెట్టే సంస్కృతి కొన్ని చోట్ల పరాకాష్ఠకు చేరింది. నేతలపై దూషణలు, మహిళల చిత్రాలు నగ్నంగా పెట్టి వేధించడం లాంటి సంఘటనలు పోలీసులకు సైతం చికాకు కలిగిస్తున్నాయి. వైసీపీ హయాం నుంచీ వస్తున్న ఈ దుష్ట సంస్కృతికి పుల్‌స్టాప్‌ పెట్టాలని, అందుకు ముందుగా వార్నింగ్‌ ఇచ్చి ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అంతకు ముందుగా ప్రజల్లో సోషల్‌ మీడియా దుష్ప్రభావంపై అవగాహన కల్పించి, మంచి పోస్టింగ్‌లకు మాత్రమే సోషల్‌మీడియాను వాడుకునేలా చర్యలు తీసుకోనున్నారు. ముం దు చెప్పి చూద్దాం...ఆ తర్వాత కఠినంగా శిక్షిద్దా’మన్న సంకేతాలు ప్రభుత్వం పంపుతోంది.


నేడు ఉద్యోగులతో పవన్‌ కాన్ఫరెన్స్‌...

భౌతికదాడులను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నిర్ణయించారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉద్యోగులతో ఏపీ స్వాన్‌ ద్వారా ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌, పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీలు, పీఆర్‌, ఆర్‌డీ అడిషనర్‌ కమిషనర్లు, కన్వర్జెన్స్‌ జాయింట్‌ కమిషనర్‌తో పాటు జిల్లా స్థాయిలో జడ్పీ సీఈవో, డీపీవోలు, డ్వామా పీడీలు, పీఆర్‌ ఎస్‌ఈలు, డీఎల్‌డీవోలు, డీఎల్పీవోలు, పీఆర్‌ ఈఈలు, మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌ అండ్‌ ఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో ఆయన వర్చువల్‌గా సమావేశమవుతారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఉద్యోగుల అభిప్రాయాలను స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్న దానిపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడితే ప్రభుత్వంపై దాడి చేసినట్లేనని, పైగా విధి నిర్వహణలోని ఉద్యోగులు జోలికి వెళ్తే పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికలు వెళ్లాలని సూచిస్తున్నారు.

Updated Date - Dec 30 , 2024 | 03:30 AM