Share News

కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఎంపీ చామల..

ABN , Publish Date - Apr 01 , 2026 | 08:55 PM

లోక్ సభలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం బిల్లుపై చర్చ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడిన తీరుపై చామల మండిపడ్డారు.

కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఎంపీ చామల..
MP Chamala Kiran Kumar Reddy

ఢిల్లీ: లోక్ సభలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం బిల్లుపై చర్చ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడిన తీరుపై చామల మండిపడ్డారు. లోక్ సభలో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించాలని కేంద్రమంత్రి ప్రయత్నించారని ఆగ్రహించారు. తానూ సభలో ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం కిషన్ రెడ్డి చేశారన్నారు. బీజేపీలో కిషన్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారని.. కేంద్ర మంత్రి వంటి పదవుల్లోనూ ఉన్నారన్నారు.


తెలంగాణలో గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఏం చేశారని ఎంపీ చామల ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంతో ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా? అని నిలదీశారు. వాళ్లు దోచుకుంటే కిషన్ రెడ్డి దాచుకున్నారా? అంటూ ఆరోపణలు గుప్పించారు చామల. కిషన్ రెడ్డి కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు తెలుసునంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై సీబీఐ విచారణ ఎందుకు చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేస్తే కిషన్ రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్నారు. కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి ఏనాడైనా ప్రధాని మోదీ దగ్గర తెలంగాణ గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు.


మూసీ ప్రక్షాళన, ట్రిపుల్ ఆర్, మెట్రో ఫేజ్-2కు కిషన్ రెడ్డి నిధులు ఎందుకు తీసుకురావడం లేదని ఆగ్రహించారు. బీఆర్ఎస్ పాలనకు కేంద్రమంత్రి వంతపాడారని.. తెలంగాణలో ఆయన ప్రేక్షకపాత్రకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీకి 8 లోక్ సభ సీట్లు ఇచ్చిందని.. కారు పార్టీ స్క్రిప్ట్‌ను లోక్ సభలో కిషన్ రెడ్డి చదివారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో లేరు కాబట్టి కిషన్ రెడ్డే బీఆర్ఎస్ తరఫున వకాలత్ తీసుకుని మాట్లాడుతున్నారని ఎంపీ చామల మండిపడ్డారు. ఇకనైనా కిషన్ రెడ్డి మారాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలు కళ్లు తెరిచారు కాబట్టే రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపి రేవంత్ రెడ్డిని సీఎం చేసుకున్నారని ఎంపీ చామల చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత..

హైదరాబాద్‌లో 10 టన్నుల కుళ్లిన మాంసం సీజ్.. నలుగురి అరెస్ట్

Updated Date - Apr 01 , 2026 | 08:55 PM