ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌కు కొత్త నిర్వచనం... సాగనంపండని రాజ్‌నాథ్ పిలుపు
ABN , Publish Date - Apr 01 , 2026 | 07:54 PM
కేరళంలోని కష్టజీవులు, నిజాయతీపరులైన ప్రజలను దశాబ్దాలుగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటక్ ఫ్రంట్ వంచిస్తున్నాయని, రెండు కూటముల్లో ఎవరో ఒకరిని ఎంచుకోవడం కాకుండా రెండింటినీ ఇంటికి సాగనంపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఎర్నాకుళం: కేరళం(Keralam)లోని కష్టజీవులు, నిజాయతీపరులైన ప్రజలను దశాబ్దాలుగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(LDF), యునైటెడ్ డెమోక్రటక్ ఫ్రంట్(UDF)లు వంచిస్తున్నాయని, రెండు కూటమిల్లో ఎవరో ఒకరిని ఎంచుకోవడం కాకుండా రెండింటినీ ఇంటికి సాగనంపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరవూర్ నియోజకవర్గంలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ జెండాలు, గుర్తులు వేరైనప్పటికీ వాటి ప్రవర్తన, క్యారెక్టర్ ఒకటేనని చెప్పారు. ఆలోచనా ధోరణి కూడా ఒకటేనన్నారు. సమాజాన్ని విడగొట్టడం, కేరళం ఆర్థిక వ్యవస్థను పతనం చేయడం కోసం పనిచేస్తుంటాయని విమర్శించారు.
ఎల్డీఎఫ్ అంటే లూటీలు, విభజనలు, వైఫల్యం(లూట్, డివిజన్, ఫెయిల్యూర్) అని రాజ్‌నాథ్ నిర్వచించారు. యూడీఎఫ్‌ను నమ్మదగని, నిజాయతీలేని, మోసపూరితమైనది(అన్ట్రస్ట్వర్తీ, డిసానెస్టీ, ఫ్రాడ్)గా రాజ్‌నాథ్ అభివర్ణించారు. రెండిట్లోనూ 'ఎఫ్' అనేది కామన్ అనీ, 'ఫ్రంట్' అంటే కరప్షన్ అని ఘాటుగా విమర్శించారు.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే(NDA) ఈ సారి కేరళం ఎన్నికల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌కు గట్టి సవాల్ విసిరేందుకు ప్రచారం ముమ్మరం చేస్తోంది. సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ దశాబ్ద కాలంగా అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలో ఎల్డీఎఫ్ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలగా ఉంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ పినరయి విజయన్ వైఫల్యాలను ఎండగడుతూ ఈ సారి 100 సీట్లలో తమ గెలుపు ఖాయమంటూ ప్రచారం సాగిస్తోంది. కాగా, బీజేపీ ఓట్ షేర్ కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగిందని, ఓటర్లు ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని ఎన్డీయే అభ్యర్థి అనూప్ ఆంటోని తెలిపారు. కాగా, కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఏప్రిల్ 9న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ
ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్