చేనేతలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి ఉచిత విద్యుత్ ప్రారంభం
ABN , Publish Date - Apr 01 , 2026 | 08:48 AM
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనుంది.
అమరావతి: రాష్ట్రంలో నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలవుతోంది. ఈ పథకం కింద చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.150 కోట్ల భారం పడనుంది. అయితే ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు ఉపశమనం లభించనుంది. ప్రతి చేనేత కార్మికుడికి ఏటా రూ.8,640, మర మగ్గాలకు రూ.21,600 ఆదా అవుతాయి. మొత్తం 1.04 లక్షల చేనేత కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. చేనేత కార్మికులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం అమలుతో చేనేత రంగం మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
Also Read:
జూలైలోగా రాష్ట్రమంతా ‘సంజీవని’
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
For More Latest News