Share News

Medaram: మేడారం మాయాదేవరల పరిరక్షణపై ఆందోళన

ABN , Publish Date - Dec 11 , 2025 | 08:10 AM

గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువై ఉన్న ఈ వనదేవతలకు రెండేళ్లకోసారి మహాజాతర జరగడం సంప్రదాయం. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మహాజాతరగా ఇది ఖ్యాతిని పొందింది.

Medaram: మేడారం మాయాదేవరల పరిరక్షణపై ఆందోళన
Medaram

  • ఆదివాసీల పూజలు అందుకుంటున్న గ్రామ దేవతలు

  • కాలగర్భంలో కలిసి పోకుండా కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

ములుగు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క - సారలమ్మ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువై ఉన్న ఈ వనదేవతలకు రెండేళ్లకోసారి మహాజాతర జరగడం సంప్రదాయం. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మహాజాతరగా ఇది ఖ్యాతిని పొందింది. ఈసారి జనవరి 28 నుంచి నాలుగు రోజులపాటు మేడారం మహాజాతర జరగనుంది. అయితే.. సమ్మక్క-సారలమ్మలు కొలువై ఉన్న మేడారానికి మరో ప్రత్యేకత ఉంది. ఆదివాసీలు అత్యంత విశ్వాసంతో రహస్యంగా కొలిచే మాయదేవరలు ఇక్కడ కూడా కొలువై ఉన్నారు. మేడారంలో కరువు కాటకాలు వాటిల్లినప్పుడు ఈ గ్రామదేవతల సన్నిధిలో ప్రత్యేకంగా రహస్య పూజలు చేయడం ఆనవాయితీ. ప్రతి రెండేళ్లకోసారి వర్షాకాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.


గ్రామం నుంచి ఐదుగురు ముత్తయిదువులు ఐదు కొత్త మట్టి కుండలను పసుపు, కుంకుమతో అలంకరించి, కంకణాలు కట్టి వాటిలో నీటిని నింపుకుని తలపై పెట్టుకుని బయల్దేరుతారు. గుప్పాల్లో (కంకపొదల్లో) ఉన్న ముగ్గురు మాయాదేవరలను నీటితో శుద్ధి చేసి పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు చేస్తారు. దీంతోపాటు గ్రామస్థులు, వనదేవత పూజారుల మాయా దేవరల ముందు రాళ్లతో పంచ పాండవుల ప్రతిమలను ఏర్పాటు చేసి పాయసాన్ని నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తారు. పంచపాండవుల సమక్షంలో మాయాదేవరలకు దీప దూప నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం గ్రామస్థులందరూ ఒకొక్కరుగా దేవరలకు కొబ్బరికాయలు కొట్టి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పిల్లాపాపలతో, పశు పాగి సంపదలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇలా మాయాదేవరలకు పూజలు చేయడం శతాబ్దాల కాలంగా ఆచారంగా వస్తున్న సంప్రదాయమని గిరిజ నులు చెబుతున్నారు.


తరతరాలుగా వస్తున్న ఆచారం..

ఈ మాయాదేవరలు గుప్పాలు కంక పొదలతో గతంలో ఒక హెక్టారు దట్టమైన అడవిలా ఉండేదని గిరిజనులు చెబుతున్నారు. అక్కడికి ఒంటరిగా వెళ్లా లంటే భయంగా ఉండేదని అంటున్నారు. గ్రామస్థు లంతా కలిసికట్టుగా వెళ్లి రెండేళ్లకోసారి పూజలు చేస్తుంటామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేడా రం సమ్మక్క ‘సారలమ్మల దేవస్థానం అభివృద్ధి కోసం సేకరిస్తున్న 19.27 ఎకరాల భూమిలో ఈ మాయగు ప్పాలకు సంబంధించిన స్థలం కూడా ఉంది. అయి తే.. అక్కడున్న గుప్పాలు(కంకపొదలు) కాల క్రమేణా అంతరించింది. ఆ ప్రదేశం వ్యవసాయ భూమిగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉండే మాయా దేవరల ప్రతిమల రాతి శిలలను గిరిజనులు, గ్రామ స్థులు సిమెంట్‌, కంకరతో గద్దెను నిర్మించి ఓ పక్క ఏర్పాటు చేశారు. అయితే.. మేడారం దేవస్థానం వం దల ఏళ్లు నిలిచేలా పనులు చేపడుతున్న క్రమంలో మాయాదేవరలకు శాశ్వత గుడి నిర్మాణం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు, గిరిజనులు కోరుతున్నారు.


శాశ్వత గుడిని నిర్మించాలంటున్న ఆదివాసీలు

కాలక్రమేణా మాయగుప్పాలు (కంకపొదలు) అంతరించి పోతుండటంతో మాయాదేవరల ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. తమను కరువు, కాటకాల నుంచి రక్షించే శకిమంతమైన మాయాదేవరల గుడి నిర్మించి ముందు తరాలకు అందించాలని కోరుతున్నారు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలు, విశ్వాసాలను శాశ్వతంగా నిలుపుకునేలా గుర్తింపు కావాలని వేడుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

అందుకే ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్స్: డీసీపీ రాజేశ్

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2025 | 08:11 AM