CM Revanth Reddy: మామునూరు ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 01 , 2025 | 10:00 PM
CM Revanth Reddy: భూసేకరణ పూర్తిచేసి వీలయినంత త్వరగా డిజైనింగ్‌కు పంపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎయిర్‌పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు.

హైదరాబాద్: మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ఇవాళ(శనివారం) అధికారులతో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఎంపీలు కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
ఎయిర్‌పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. భూసేకరణ పూర్తిచేసి వీలయినంత త్వరగా డిజైనింగ్‌కు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ ఎయిర్ పోర్టు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎయిర్ పోర్టు వద్ద నిత్యం యాక్టివిటీ ఉండేలా ఎయిర్ పోర్టు డిజైన్ చేయాలని సూచించారు. విమాన రాకపోకలతో పాటు ఇతర యాక్టివిటీస్ ఉండేలా, వరంగల్ నగరానికి ఎస్సెట్‌గా విమానాశ్రయ నిర్మాణం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ప్రతీ నెలా తనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా మామునూరు విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ధన్యవాదాలు తెలిపారు.
కార్మిక శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
ఏటీసీల ఏర్పాటుకు అవసరమైన నిధులు ప్రభుత్వం వెంటనే అందించేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కార్మిక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా(ఏటీసీ) అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు.
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏటీసీ ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఐటీఐలు లేనిచోట ఏటీసీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో లేదా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఏటీసీలలో అవసరమైన సిబ్బంది ఇతర వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. సిబ్బంది నియామకంపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్స్ యాక్ట్‌పై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.