Share News

Rahul Gandhi: రాజకీయాల్లోకి.. కొత్త తరం రావాలి

ABN , Publish Date - Apr 27 , 2025 | 03:35 AM

ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. పదేళ్ల క్రితం అనుసరించిన రాజకీయ సూత్రాలు, అప్పుడు ప్రభావశీలంగా ఉన్న విధానాలు ఇప్పుడు పనికిరావన్నారు.

Rahul Gandhi: రాజకీయాల్లోకి.. కొత్త తరం రావాలి

  • ప్రజలతో నేరుగా సంబంధాలు నెరపాలి

  • పదేళ్ల కిందటి విధానాలు ఇప్పుడు పనికిరావు

  • బీజేపీది ప్రతిపక్షాలను తొక్కేసే విధానం

  • కాంగ్రెస్‌ పట్ల పగ, విద్వేషపు దృష్టి కోణం

  • విద్వేష రాజకీయాల్ని ప్రేమతో ఎదుర్కొంటాం

  • ప్రజల బాధలు వినడమే అత్యంత ముఖ్యం

  • భారత్‌ సదస్సు-2025లో రాహుల్‌గాంధీ

  • మా మిషన్‌లో మీరూ చేరండి

  • ‘తెలంగాణ రైజింగ్‌’ అంబాసిడర్లుగా

  • రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి

  • సదస్సులో ప్రతినిధులకు సీఎం రేవంత్‌ పిలుపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. పదేళ్ల క్రితం అనుసరించిన రాజకీయ సూత్రాలు, అప్పుడు ప్రభావశీలంగా ఉన్న విధానాలు ఇప్పుడు పనికిరావన్నారు. ప్రస్తుత సమాజంలో ఉత్పన్నమవుతున్న కొత్త తరహా ఆలోచనలకు అనుగుణంగా ఇప్పటి రాజకీయాలు ఉండాలని, రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని పిలుపునిచ్చారు. ప్రజలతో నేరుగా సంబంధాలు నెరపాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే ఇప్పుడు మనందరి ముందున్న పెద్ద సవాలు అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లోని నోవాటెల్‌ హోటల్‌లో జరిగిన రెండు రోజుల ‘భారత్‌ సదస్సు-2025’ ముగింపు రోజైన శనివారం విదేశీ ప్రతినిధులనుద్దేశించి రాహుల్‌ ప్రసంగించారు. ప్రస్తుత దుందుడుకు రాజకీయాల్లో ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారని, తాము మాట్లాడకుండా అన్ని మార్గాలను మూసేస్తున్నారని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారిదంతా ప్రతిపక్షాలను తొక్కేసే విధానమన్నారు. ఆధునిక రాజకీయాల్లో ప్రేమ, సహనం అవసరమని, విద్వేష రాజకీయాలను ఎదుర్కోవాలంటే ప్రేమే మార్గమని అన్నారు. పగ, విద్వేషాలను ద్వేషంతో ఎదుర్కోవడం సరికాదని, ప్రేమతోనే వాటిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీలు తమ పట్ల కోపం, విద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాయని, భయపెట్టాలని చూస్తున్నాయని తెలిపారు. అయినా.. కాంగ్రెస్‌ పార్టీ వాటి పట్ల ప్రేమతోనే మసలుకుంటుందని చెప్పారు.

2 copy.jpg


ప్రజలతోనే మమేకమవుతాం..

దేశంలో చోటుచేసుకున్న విధ్వంసకర రాజకీయాల వల్ల కాంగ్రెస్‌ పార్టీని అణగదొక్కే పరిస్థితులు ఏర్పడ్డాయని రాహుల్‌గాంధీ తెలిపారు. ప్రతిపక్షం మాట్లాడే మార్గాలన్నింటినీ మూసేశారని, మీడియా కూడా వారితో రాజీ పడిందని ఆరోపించారు. ఇలాంటి సందర్భంలో తాము నేరుగా ప్రజలతోనే మమేకం కావాలని నిర్ణయించుకున్నామన్నారు. తమ వ్యతిరేకులు పగ, విద్వేషాలతో నిండిపోయారని, అలాంటి వారితో పోటీ పడలేకపోయామని, విద్వేషాలు, కోపతాపాలతో తాము పని చేయలేకపోయామని చెప్పారు. విద్వేషాలకు వ్యతిరేకంగా పని చేయాలంటే ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలన్న విషయమై తమ పార్టీ రకరకాలుగా ఆలోచించిందన్నారు. అందులో భాగంగానే.. ప్రజలు ఏం మాట్లాడుతున్నారో, ఏం చెప్పదలచుకున్నారో వినాలనుకున్నామని తెలిపారు. వారికి ప్రజల బాధలు వినడం తెలియదని, ఎందుకంటే వారికి సమాధానాలు తెలుసునని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి రాహుల్‌ వ్యాఖ్యానించారు. ప్రజల బాధలు వినడం అత్యంత ముఖ్యమని, ఇందుకోసమే తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 4వేల కిలోమీటర్లు ‘భారత్‌ జోడో’ పేర పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. ఆ యాత్ర సందర్భంగా తమతో వేలాది మంది కలిసి వచ్చారని పేర్కొన్నారు. చాలా మంది వచ్చి తనతో మాట్లాడేవారని, అప్పుడు వారి బాధలు విన్నానని చెప్పారు. అప్పుడే ‘వినడం’ నేర్చుకున్నానని, పాదయాత్రలో కొన్ని రోజుల తర్వాత తాను మాట్లాడడం మాని, వినడానికే ప్రాధాన్యమిచ్చానని తెలిపారు. ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే ఇదే చాలా ప్రభావవంతమైన విధానమని తెలుసుకున్నానన్నారు.


ఆ విషయంలో విఫలమయ్యాం..

సోషల్‌ మీడియా, ఇతర కమ్యూనికేషన్‌ మాధ్యమాల కారణంగా ప్రజలు ఏం చెబుతున్నారో వినలేపోయామని రాహుల్‌ తెలిపారు. ఈ విషయంలో తాము విఫలమయ్యామన్నారు. అందుకే తాము ప్రజలను నేరుగా కలవాలనుకుంటున్నామని, వారి పిల్లల విద్యకు, ఆర్థిక పరిపుష్టికి సహాయ పడతామనే విధానంతో వెళ్లాలనుకుంటున్నామని చెప్పారు. ప్రజల పట్ల ప్రేమ అనేది తన రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని, ప్రజలతో మమేకం కావడాన్ని మరింత సులభతరం చేసిందని అన్నారు. తాము పాదయాత్ర సందర్భంలో ఇచ్చిన ‘విద్వేషపు మార్కెట్‌లో ప్రేమ దుకాణం’ అనే నినాదం ఇప్పుడు దేశంలో చాలా పవర్‌ఫుల్‌ నినాదంగా మారిందన్నారు. ఇక్కడ జరిగిన చర్చలు తప్పకుండా భారత దేశంలో కొత్త రాజకీయాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రసంగ ప్రారంభంలో సదస్సుకు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులకు రాహుల్‌ స్వాగతం పలికారు. కశ్మీర్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో తమకు సంఘీభావంగా నిలిచారంటూ ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్వాగతం పలికారు. సదస్సు ముగిసిన అనంతరం సాయంత్రం 7గంటలకు రాహుల్‌ తిరిగి ఢిల్లీకి వెళ్లారు.


తుమ్మల.. ఎలా ఉన్నారు?.. పలకరించిన రాహుల్‌

2 copy.jpg

భారత్‌ సదస్సులో తన ప్రసంగం అనంతరం వెళ్లిపోతున్న క్రమంలో వేదికపై ఉన్న మంత్రి తుమ్మలను రాహుల్‌ దగ్గరకు పిలిచారు. ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా పలకరించారు. తుమ్మలతో కరచాలనం చేశారు

రాహుల్‌కు పుస్తకమిచ్చిన సీతక్క

2 copy.jpg

రాహుల్‌గాంధీకి.. ఇందిరాగాంధీకి నెహ్రూ రాసిన లేఖల సమాహారంతో రూపొందిన ‘‘లెటర్స్‌ ఫ్రం ఏ ఫాదర్‌ టూ హిజ్‌ డాటర్‌’’ పుస్తకాన్ని మంత్రి సీతక్క బహూకరించారు.

చరఖా తిప్పిన మంత్రి పొంగులేటి..

2 copy.jpg

భారత్‌ సమ్మిట్‌ కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఐసీసీలో ఏర్పాటుచేసిన చరఖా స్టాల్‌ దగ్గరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లారు. ఆయన కూడా అక్కడ కూర్చుని నూలు వడికారు.

ముత్యాలపై విదేశీ మహిళ మురిపెం!

2 copy.jpg

భారత్‌ సదస్సుకు హాజరైన విదేశీ మహిళ ఒకరు ముత్యాలపై మనసు పారేసుకున్నారు. సెర్బియాకు చెందిన సదరు మహిళ ముత్యాలను విక్రయించే స్టాల్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న ముత్యాలను చూస్తూ పరవశించిపోయారు. ‘‘ సో నైస్‌’’ అంటూ.. నచ్చిన వాటిని కొనుగోలు చేశారు. రూ.2,400 విలువ చేసే ముత్యాలను ఆమె కొనుగోలు చేశారని దుకాణదారుడు తెలిపారు.

Updated Date - Apr 27 , 2025 | 03:35 AM