Share News

Children Sick: ఇంజక్షన్‌ వికటించి.. 17 మంది చిన్నారులకు అస్వస్థత

ABN , Publish Date - Nov 16 , 2025 | 08:10 AM

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్‌ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇచ్చిన యాంటీ బయాటిక్‌ ఇంజక్షనే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

 Children Sick: ఇంజక్షన్‌ వికటించి.. 17 మంది చిన్నారులకు అస్వస్థత
Childrens Sick

ఐసీయూకు తరలించి చికిత్స.. కోలుకుంటున్న చిన్నారులు

నాగార్జునసాగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన

నాగార్జునసాగర్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా (Nalgonda Dist) నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్‌ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు (Childrens Sick) గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇచ్చిన యాంటీ బయాటిక్‌ ఇంజక్షనే ఇందుకు కారణమని భావిస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ, పైలాన్‌ కాలనీలతోపాటు సాగర్‌ పరిసర గ్రామాలకు చెందిన 21 మంది చిన్నారులు విషజ్వరాలతో మూడు రోజుల క్రితం నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో చేరారు.


కాగా, శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో డ్యూటీలో ఉన్న నర్సు వీరిలో 17 మంది చిన్నారులకు సెలైన్‌ పెట్టిన అనంతరం యాంటీ బయాటిక్‌ ఇంజక్షన్‌ వేశారు. తరువాత వారిలో 12 మందిని డిశ్చార్జి చేశారు. అయితే ఇంటి కెళ్లిన అరగంట తర్వాత చిన్నారులు వాంతులు, విరేచనాలు, చలిజ్వరంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో తల్లిదండ్రులు రాత్రికి రాత్రే 8 మంది చిన్నారులను తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో ఏదో జరిగిందని భావించిన వైద్యులు.. మిగిలిన నలుగురు చిన్నారులనూ ఫోన్‌ చేసి ఆస్పత్రికి పిలిపించారు. వారితోపాటు ఆస్పత్రిలోనే ఉన్న ఐదుగురి పరిస్థితి కూడా అలాగే మారింది. దీంతో మొత్తం 17 మంది చిన్నారులను ఐసీయూకు తరలించి చికిత్స అందించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నారు. అర్ధరాత్రి విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భానుప్రసాద్‌ ఆస్పత్రికి చేరుకొని మరో డాక్టర్‌ను పిలిపించి చిన్నారులకు వైద్య సేవలు అందించారు. దీంతో చిన్నారులు కోలుకుంటున్నట్లు సూపరింటెండెంట్‌ తెలిపారు.


డీహైడ్రేట్‌ కావడం వల్లే: డీసీహెచ్‌

డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, డీసీహెచ్‌ మాత్రునాయక్‌ ఆస్పత్రికి చేరుకొని చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి విషయం తెలుసుకున్నా రు. యాంటీ బయాటిక్‌ ఇంజక్షన్‌ వేయడంతో చిన్నారుల శరీరం డీహైడ్రేట్‌ అయిందని, దీంతో కడుపులో మంట, వాంతులు, విరేచనాలు అయి చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని డీసీహెచ్‌ తెలిపారు. ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. అయితే నిజ నిర్ధారణకు కమిటీ వేసి మూడు రోజుల్లో విచారణ చేపడతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ నారాయణ అమిత్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 16 , 2025 | 08:31 AM