Rega Kantha Rao Fires on Congress: తాటాకు చప్పుళ్లకు భయపడను.. కాంగ్రెస్ నేతలకి రేగా కాంతారావు స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:43 PM
పినపాక అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్య అని రేగా కాంతారావు పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మణుగూరులో బీఆర్ఎస్ (BRS) కార్యాలయంపై కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు (Rega Kantha Rao) పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి విషయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయం పాటించాలని సూచించారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదని హెచ్చరించారు. కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) భద్రాద్రి కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడారు రేగా కాంతారావు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. కాంగ్రెస్ నేతల వద్ద ఆధారాలు ఉండి చూపిస్తే ఆ కార్యాలయం అప్పగిస్తానని స్పష్టం చేశారు. చట్టంపై తనకు నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. తమ పార్టీ కార్యాలయంలో విలువైన వస్తువులు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పినపాక అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు రేగా కాంతారావు.
తనను ఎంత రెచ్చగొడితే అంతకంత ప్రశ్నిస్తానని హెచ్చరించారు. పినపాక అభివృద్ధి కోసం ఏమైనా చేస్తానని చెప్పుకొచ్చారు. డీఎం.ఎఫ్.టి. నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో లెక్కలు చూపాలని సవాల్ విసిరారు. ఈనెల 7వ తేదీన తలపెట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ బుద్ధి చెబుతానని రేగా కాంతారావు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి నయా ప్లాన్
కేసీఆర్ హయాంలో చెరువులు, నాళాల కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు: ఎంపీ చామల
Read Latest Telangana News And Telugu News