Ponguleti Srinivas Reddy: తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:07 AM
కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విలన్‌గా చూపించాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు

సోనియాకు సాష్టాంగ నమస్కారం మరిచారా?
కాంట్రాక్టర్లకు బకాయిలు, సర్పంచ్‌లకు బాకీలు కేసీఆర్ హయాంలో పెట్టినవే..
మేం ఇబ్బంది పెట్టాలనుకుంటే సభ జరిగేదేనా?: మంత్రి పొంగులేటి
నియంతలా కేసీఆర్ మాటలు: సీతక్క
సోనియాగాంధీ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయాలి: పొన్నం
కేసీఆర్‌లో ఇంకా గర్వం పోలేదు: జూపల్లి
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): మనసంతా విషాన్ని నింపుకొన్న కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీని విలన్‌గా చూపించే ప్రయత్నం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని విలన్‌గా చూపిస్తున్నారా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసిన సంగతి మరిచిపోయారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఆదివారం సీఎం రేవంత్ నివాసం వద్ద మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు దళితుడిని సీఎం చేయలేకపోయిన కేసీఆర్.. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నేత హోదా అయినా దళితుడికి ఇచ్చి ఉండవచ్చు కదా అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లకు ప్రభుత్వ బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు.
80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. ఆ జ్ఞానాన్ని అసెంబ్లీలో ప్రదర్శిస్తారనుకున్నామని, కానీ రాలేదని ఎద్దేవా చేశారు. ‘‘బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ కలలు కంటున్నారు. కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ సభలకు రాకుండా ఆటోడ్రైవర్లను, ప్రైవేటు టాక్సీ డ్రైవర్లను ఇబ్బంది పెట్టారు. ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకోనివ్వకుండా చేశారు. మేమూ అలా ఇబ్బంది పెట్టాలనుకుంటే కేసీఆర్ సభ జరిగి ఉండేదే కాదు..’’ అని పొంగులేటి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి, ట్యాపింగ్ చేసిన వారిని విదేశాల్లో ఉంచి డ్రామాలాడుతున్న కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత లేదని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డును దగ్గరి వాళ్లకు లీజుకు ఇచ్చుకున్నదెవరని.. మద్యం దుకాణాల టెండర్లను ముందే ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. ఒక నియంత తన అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాట్లాడినట్టుగా కేసీఆర్ ప్రసంగం ఉందని మంత్రి సీతక్క విమర్శించారు. వారి కుటుంబంలో చీలికలు పెరుగుతున్నాయన్న బాధ కేసీఆర్‌లో కనిపించిందని పేర్కొన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత ఖరీదైన కార్లలో తిరగొచ్చుగానీ.. పేద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో తిరగొద్దా? అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలను సొల్లు కబుర్లంటూ అవమానించిన కేసీఆర్‌కు.. మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత ఉందా? అని నిలదీశారు. మరి ఆయన కొడుకు, అల్లుడిని అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారని ప్రశ్నించారు.
ఆ మాటలు ఉపసంహరించుకోవాలి: పొన్నం
తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్ పార్టీ అన్న కేసీఆర్ మాటలను ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోనియాగాంధీ తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ ఇవ్వలేరన్న సంగతి కేసీఆర్‌కు తెలుసని చెప్పారు. సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో సోనియా గాంధీ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ సభకు జనం రాకుంటే.. ఆ నెపం పోలీసులు, ప్రభుత్వంపైకి నెట్టడం ఏమిటని నిలదీశారు. జనం రాకపోవడం వల్లే.. కేసీఆర్ అరగంట సేపు వేదికపైకి రాలేదన్నారు.
కేసీఆర్ ఇంట్లో వేల కోట్లు: జూపల్లి
కేసీఆర్ హయాంలో జరిగిన రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. అక్షయపాత్ర లాంటి ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ అమ్ముకున్నారని ఆరోపించారు. అధికారం పోయినా కేసీఆర్‌లో గర్వం పోలేదని విమర్శించారు. కేసీఆర్ నిజాయతీపరుడైతే ఆయన పార్టీకి రూ. 1,500 కోట్ల ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో పనిచేసిన ఇంజనీర్ దగ్గరే రూ.వంద కోట్లపైగా ఆస్తులు దొరికాయని.. కేసీఆర్ ఇల్లును సోదా చేస్తే రూ. వేల కోట్లు దొరుకుతాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ సభలో కేసీఆర్ ప్రసంగంలో స్వయం డబ్బా, పరనింద తప్ప ఏమీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఒక ప్రకటనలో విమర్శించారు. కేసీఆర్ రెచ్చగొడితే రెచ్చిపోడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. కేసీఆర్‌కు సీఎం పదవే కాంగ్రెస్ పెట్టిన భిక్ష అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News